PM Modi in Lok Sabha: కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఉభయసభలనుద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడిన మోదీ.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అనేక రాష్ట్రాలు కాంగ్రెస్‌ను గద్దె దించాయని, చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చెలాయించి ఏళ్లు గడిచిపోతున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినా కాంగ్రెస్ అహంకారం మాత్రం తగ్గడం లేదని మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని చెప్పారు.
"ఈరోజు దేశంలోని పేద ప్రజలకు గ్యాస్ కనెక్షన్ లభిస్తోంది. ఇళ్లు, శౌచాలయాలు లభిస్తున్నాయి. సొంతంగా బ్యాంకు ఖాతాను ఉపయోగించుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు కొందరి(కాంగ్రెస్‌ను ఉద్దేశించి) ఆలోచనలు 2014లోనే ఉండిపోయాయి. బంగాల్, అసోం, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్ వంటి పలు రాష్ట్రాలు కాంగ్రెస్‌ను ఎప్పుడో మర్చిపోయాయి. తెలంగాణ ఇచ్చామని మీరు చెప్పుకుంటారు. కానీ అక్కడి ప్రజలు మిమ్మల్ని ఆదరించలేదు. ఝార్ఖండ్ ఏర్పడి 20 ఏళ్లు అవుతోంది. అయినా ఇప్పటికీ అక్కడ ప్రజల మనసులను గెలుచుకోలేకపోయారు. పరోక్ష మార్గంలో అధికారంలోకి రావాలని అనుకుంటున్నారు. ఎన్ని ఎన్నికల్లో ఓడిపోయినా మీ(కాంగ్రెస్) అహంకారం మాత్రం తగ్గలేదు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు గడిచినా కొందరి తీరు మాత్రం మారలేదని మోదీ వాగ్బాణాలు సంధించారు. బ్రిటిషర్ల సూత్రమైన విభజించు-పాలించు అనే పద్ధతిని కాంగ్రెస్ పార్టీ ఒంటబట్టించుకుందని ధ్వజమెత్తారు. దేశ విభజన శక్తులకు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహిస్తోందని మండిపడ్డారు. కరోనాపైనా కాంగ్రెస్ రాజకీయాలు చేసిందని విమర్శించారు.
PM Modi news:
వచ్చే వందేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని కాంగ్రెస్ పార్టీ నిశ్చయించుకుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు మోదీ. తాము కూడా వందేళ్ల వరకు అధికారంలో ఉండేందుకు సిద్ధంగా ఉంటామని చురకలు అంటించారు.
"మీరు నన్ను వ్యతిరేకించవచ్చు. కానీ ఫిట్ ఇండియా పథకాన్ని, ఇతర పథకాలను మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వోకల్ ఫర్ లోకల్ గురించి మాట్లాడినప్పుడు మీరు నన్ను విస్మరిస్తారు. మోదీ చెప్పారు కాబట్టి ఆ పదాన్నే పలకకూడదని మీరు అనుకుంటారు. స్వదేశీ వస్తువులను ఉపయోగించాలని మహాత్మా గాంధీనే స్వయంగా చెప్పారు. మహాత్మా గాంధీ కలను నెరవేర్చేందుకు మీరు(కాంగ్రెస్) ఎందుకు కృషి చేయడం లేదు. ఇన్ని రాష్ట్రాల్లో ఏళ్ల నుంచి ఎందుకు అధికారంలోకి రాలేకపోయారో ఇక్కడే అర్థమవుతోంది. తర్వాతి వందేళ్ల వరకు అధికారంలోకి రాకూడదని మీరు నిర్ణయించుకున్నట్లు అనిపిస్తోంది. కాబట్టి.. మేం కూడా అందుకు సిద్ధంగా ఉంటాం."