PM Modi Mann Ki Baat Today :భారత్ ఎదుర్కొన్న అత్యంత క్రూరమైన దాడుల్లో ముంబయి దాడులు కూడా ఒకటని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఆ దాడి నుంచి వేగంగా కోలుకుని తీవ్రవాదాన్ని అన్ని రకాలుగా అణచివేశామని.. భారత్ సామర్థ్యానికి ఇదే నిదర్శనమని చెప్పారు. మన్ కీ బాత్ ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్న ప్రధాని మోదీ.. ముంబయి దాడుల్లో ప్రాణాలు కోల్పోయినవారికి నివాళులర్పించారు.
ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
నవంబరు 26న భారత రాజ్యాంగాన్ని.. రాజ్యాంగ అసెంబ్లీ ఆమోదించిందని గుర్తుచేశారు. 2015లో అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా నవంబరు 26నాడు రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలనే ఆలోచన తనకు వచ్చిందని చెప్పారు. దేశ ప్రజలకు రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షాలు తెలిపారు. ఇటీవల పండుగల సందర్భంగా 4 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం దేశంలో జరిగిందన్న ప్రధాని ఎక్కువ మంది భారత్‌లో తయారైన వస్తువులే కొనుగోలు చేశారని సంతోషం వ్యక్తంచేశారు. విదేశాల్లో పెళ్లిళ్లు చేసుకునే కొత్త సంస్కృతికి స్వస్తి చెప్పి దేశంలోనే వివాహాలు చేసుకోవాలని దేశ ప్రజలకు మోదీ విజ్ఞప్తి చేశారు.
"మీరే ఆలోచించండి. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాలు విదేశాలకు వెళ్లి పెళ్లిళ్లు చేసుకుంటూ కొత్త వాతావరణం సృష్టిస్తున్నాయి. అది అవసరమా? భారతగడ్డపై, భారతీయుల సమక్షంలో మనం పెళ్లిళ్లు చేసుకుంటే దేశ సంపద దేశంలోనే ఉంటుంది. దేశ ప్రజలకు కూడా మీ పెళ్లిళ్లలో సేవ చేసేందుకు అవకాశం కల్పించాల్సిన అవసరముంది. పేద ప్రజలు కూడా తమ పిల్లలతో మీ పెళ్లిళ్ల గురించి చెబుతారు. ఎప్పుడంటే వోకల్ ఫర్ లోకల్ మిషన్‌ను విస్తరించేందుకు మీరు మీ పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమాలను దేశంలోనే నిర్వహించినపుడు. ఇది అనేక కుటుంబాలతో ముడిపడిన విషయం. నా బాధను ఆ కుటుంబాలు అర్థం చేసుకుంటాయని ఆశిస్తున్నాను."