Ganga Expressway: గంగా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా యువతకు ఉపాధి సహా ఎన్నో కొత్త అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. త్వరలోనే అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్ నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎక్స్‌ప్రెస్‌వేలు, విమానాశ్రయాలు, రైలు మార్గాల నిర్మాణమే అందుకు ఉదాహరణ అని పేర్కొన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్పుర్లోని గంగా ఎక్స్‌ప్రెస్‌వేకు శనివారం శంకుస్థాపన చేశారు మోదీ. ఈ సందర్భంగా ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
"మేరఠ్, హాపుర్, బులంద్ శహర్, అమ్రోహా, సంభాల్, బదౌన్, షాజహాన్‌పుర్, హర్దోయ్, ఉన్నావ్, రాయ్‌బరేలీ, ప్రతాప్‌గఢ్, ప్రయాగ్‌రాజ్ జిల్లా ప్రజలకు అభినందనలు. రూ.36,000 కోట్లతో నిర్మిస్తున్న ఈ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఇక్కడి ప్రాంతాల్లో కొత్త పరిశ్రమలు వెలుస్తాయి. అత్యాధునిక మౌలిక వసతులు కలిగిన రాష్ట్రంగా ఉత్తర్‌ప్రదేశ్‌ను గుర్తించే రోజు ఎంతో దూరంలో లేదు. ఇక్కడ నిర్మిస్తున్న ఎక్స్‌ప్రెస్‌వేలు, విమానాశ్రయాలు, రైలు మార్గాలు ప్రజలకు అరుదైన అవకాశాలను కల్పిస్తాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
Modi Up Development: "వనరులను ఎలా ఉపయోగించాలనేదానికి ఉత్తర్‌ప్రదేశ్‌కు తరలివస్తున్న ఆధునిక మౌలిక వసతులే ఉదాహరణ. అంతకుముందు ప్రజాధనాన్ని ఎలా వినియోగించారో మీరు చూశారు. కానీ, ఈ రోజు యూపీ ప్రజల సొమ్మును యూపీ అభివృద్ధి కోసమే వినియోగిస్తున్నాం. గతంలో పెద్ద ప్రాజెక్టులకు కాగితాలకే పరిమితమయ్యాయి" అని మోదీ పేర్కొన్నారు.