PM Modi Independence Day Speech :2024లోనూ ఎర్రకోట నుంచి మళ్లీ తానే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తానని ధీమా వ్యక్తం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ కూటమే అధికారంలోకి వచ్చి.. తానే ప్రధాని పీఠం అధిరోహిస్తానని చెప్పకనే చెప్పారు. వచ్చే ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం నాడు ప్రజలకు తాను చేసిన ప్రగతిని వివరిస్తానని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఎర్రకోటపై జాతీయ జెండా ఆవిష్కరణఅనంతరం మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
"మార్పు కోసం నేను చేసిన వాగ్దానాలు నన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి. వాగ్దానాలపై నా పనితీరు తిరిగి నన్ను మళ్లీ ఇక్కడికి తీసుకువస్తాయి. వచ్చే ఐదేళ్లు అభివృద్దికి అపూర్వమైన రోజులు. 2024 కల్లా దేశాన్ని అభివృద్ది చెందిన దేశంగా మార్చేందుకు అవి దోహదం చేస్తాయి. వచ్చే ఏడాది ఆగస్టు 15న ఇదే ఎర్రకోట నుంచి దేశ ప్రగతిని వివరిస్తాను. మీరు నాపై నమ్మకం ఉంచారు. నేను ఆ నమ్మకాన్ని నెరవేర్చేందుకు ప్రయత్నించాను. గత ఐదేళ్లలో నేను చేసిన వాగ్దానాలు నాలో విశ్వాసాన్ని నింపాయి. సంస్కరణలు, పనితీరు, మార్పు ద్వారా వాటిని నెరవేరుస్తానని మాటిచ్చాను." అని ఎర్రకోట నుంచి మోదీ ప్రసంగించారు. తాను దేశం కోసమే గర్వంగా కష్టపడి పనిచేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు.
వసుధైక కుటుంబమే భారత నీతి ..
విశ్వామిత్ర రూపంలో ప్రతి దేశానికి మిత్రదేశంగా భారత్ ఉండాలనుకుంటోందని మోదీ వెల్లడించారు. ప్రపంచంలోని ప్రతి దేశం భారత్‌కు మిత్రుడేనని ఆయన వ్యాఖ్యానించారు. లోక కల్యాణం కోసం భారత్ పనిచేస్తోందని పునరుద్ఘాటించారు. ఒకే సూర్యుడు, ఒకే భూమి, ఒకే ప్రపంచమన్నది భారత విధానమని ప్రధాని వివరించారు. ఒకే భూమి, సర్వమానవాళి సంక్షేమ లక్ష్యంగానే భారత్ విధానాలు ఉంటాయని ఆయన ప్రకటించారు. వసుధైక కుటుంబం-వన్ వరల్డ్, వన్ ఫ్యామిలీ అన్నదే భారత నీతి మోదీ పేర్కొన్నారు.