హెలికాప్టర్ క్రాష్‌లో సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ మరణించడం ప్రతి దేశభక్తుడికీ లోటేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఘటనలో మరణించిన ఇతర సైనికులను స్మరించుకున్న మోదీ.. దేశ సైన్యం స్వయం సమృద్ధి సాధించే దిశగా జనరల్ రావత్ నిరంతరం కృషి చేశారని తెలిపారు. భారత్ సమున్నత శిఖరాలకు చేరడాన్ని రావత్ చూస్తూనే ఉంటారని అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్ బలరాంపుర్‌లో నిర్మించిన సరయూ నహర్ నేషనల్ ప్రాజెక్టును ఆవిష్కరించిన ఆయన... అక్కడి బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
"ఓ సైనికుడు మిలిటరీలో ఉన్నంతవరకే సైనికుడు కాదు. వారి జీవితాంతం వారు యోధులుగానే ఉంటారు. జనరల్ బిపిన్ రావత్ ఎక్కడున్నా.. భారత్ కొత్త ఎత్తులకు చేరడాన్ని చూస్తూనే ఉంటారు. భారత్‌ను మరింత శక్తిమంతంగా తయారు చేస్తాం. దేశాన్ని సుసంపన్నంగా తీర్చిదిద్దుతాం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఘటనలో ప్రాణాలతో బయటపడ్డ గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ ఆరోగ్యంపై కీలక ప్రకటన చేశారు మోదీ. వైద్యులు ఆయన్ను కాపాడేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు. ఆయన కుటుంబానికి దేశం అండగా ఉంటుందని చెప్పారు.
'ఇద్దరు భారతరత్నలు ఇక్కడివారే'
ఈ సందర్భంగా బలరాంపుర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు మోదీ. ఇక్కడి ప్రజలు అభిజ్ఞులని అన్నారు.
"అయోధ్య రామమందిరం గురించి మాట్లాడుకుంటే.. బలరాంపుర్ మహారాజా పటేశ్వరీ ప్రసాద్ సింగ్ సాహెబ్ చేసిన సేవలు గుర్తొస్తాయి. బలరాంపుర్ ప్రజలు అభిజ్ఞులు. నానాజీ దేశ్‌ముఖ్, అటల్ బిహారీ వాజ్‌పేయీ రూపంలో దేశానికి ఇద్దరు భారతరత్నలను అందించారు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
'నాలుగేళ్లలోనే పూర్తి చేశాం'
యూపీ పర్యటనకు ముందు ఈ ప్రాజెక్టుపై ట్వీట్ చేసిన మోదీ.. నాలుగు దశాబ్దాలుగా అసంపూర్తిగా ఉన్న జాతీయ ప్రాజెక్టును కేవలం నాలుగేళ్లలో పూర్తిచేశామని అన్నారు. సుధీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం నిబద్ధతతో పనిచేసిందని చెప్పారు. యూపీ తూర్పు ప్రాంతంలో రైతుల కష్టాలు ఈ ప్రాజెక్టుతో తీరిపోతాయని వెల్లడించారు.
రూ.9.800 కోట్లతో ఈ ప్రాజెక్టు చేపట్టగా.. గత నాలుగేళ్లలోనే రూ.4600 కోట్లను వెచ్చించారు. ఘగ్గర్, సరయూ, రాప్తి, బంగాంగా, రోహిణీ నదుల అనుసంధానిస్తూ నీటి వనరులను మెరుగ్గా ఉపయోగించుకునేలా ఈ ప్రాజెక్టు రూపొందించారు.
నిధుల లేమితో ఈ ప్రాజెక్టును ఇన్నేళ్లుగా నిలిచిపోయిందని పీఎంఓ తెలిపింది. రైతుల సంక్షేమం కోసం దీనిని పూర్తి చేయాలని ప్రధాని సంకల్పించారని పేర్కొంది. ఈ క్రమంలో 2016లో ఈ ప్రాజెక్టును 'ప్రధాన్ మంత్రి కృషి సంచాయ్ యోజన'లో చేర్చి నిర్ణీత సమయంలో పూర్తిచేసినట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి:పినాక రాకెట్ లాంచర్ విస్తరణ ప్రయోగం విజయవంతం