PM Modi 6G: ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ టెలికాం నెట్వర్క్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని భారత్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అనుసంధానతే.. 21వ శతాబ్దంలో ఓ దేశ ప్రగతిని నిర్ణయిస్తుందని.. ఈ నేపథ్యంలో ఆధునిక మౌలిక సదుపాయాలను మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మంగళవారం ఆన్లైన్ వేదికగా దిల్లీలోని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(ట్రాయ్) రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. ఈ మేరకు ప్రసంగించారు. దేశంలో త్వరలో 5జీ సేవలను ప్రారంభించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెట్వర్క్ అమల్లోకి వస్తే.. దేశ ఆర్థిక వ్యవస్థలో మరో 450 బిలియన్ డాలర్లు వచ్చి చేరతాయని అంచనా వేస్తున్నట్లు ప్రధాని చెప్పారు.
'5జీ సాంకేతికత.. పాలనావ్యవస్థలో సానుకూల మార్పులు తీసుకువస్తుంది. జీవన సౌలభ్యం, సులభతర వ్యాపారానికి కూడా దన్నుగా ఉంటుంది. వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్ రంగాల్లో వృద్ధిని పెంచుతుంది. 5జీతో కేవలం ఇంటర్నెట్ వేగమే కాదు.. అభివృద్ధి వేగం కూడా పెరుగుతుంది. ఉద్యోగాలనూ సృష్టిస్తుంది' అని ప్రధాని అన్నారు. ఈ దశాబ్దం చివరి నాటికి 6జీ నెట్వర్క్ను అందుబాటులోకి తెచ్చేందుకు టాస్క్ఫోర్స్ ఇప్పటికే రంగంలోకి దిగినట్లు వెల్లడించారు. గత యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ.. 2జీ యుగం విధానపర లోపాలు, అవినీతికి ప్రతీకగా నిలిచిందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో దేశం పారదర్శకంగా 4జీ సేవల దిశగా మళ్లిందని, ఇప్పుడు 5జీకి వెళ్తోందని తెలిపారు.