NITI Aayog Meeting: జాతీయ విద్యా విధానం అమలు(ఎన్ఈపీ), పంటల వైవిధ్యం, పట్టణాభివృద్ధి సహా పలు కీలక అంశాలపై చర్చించేందుకు నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశమైంది. దిల్లీ రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్‌నాథ్ సింగ్, ఎస్ జైశంకర్ కూడా హాజయ్యారు.
2019 జులైలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం తర్వాత పాలక మండలి సభ్యులు భౌతికంగా హాజరవడం ఇదే తొలిసారి. ఈ మూడేళ్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా భేటీలు జరిగాయి. 2020లో కరోనా వైరస్ నేపథ్యంలో నీతి ఆయోగ్ సమావేశం కాలేదు. 2015 ఫిబ్రవరి 8న తొలి భేటీ జరిగింది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఈ సమావేశాలకు దూరంగా ఉన్నారు. నీతి ఆయోగ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కేసీఆర్.. సమావేశాలను బహిష్కరించారు. జాతీయ ప్రణాళిక సంఘానికి ప్రత్యామ్నాయంగా ఎన్డీఏ ప్రభుత్వం తెచ్చిన నీతి ఆయోగ్‌తో ఉపయోగం లేదని, నీతి ఆయోగ్‌లో నీతి లేదని విమర్శించారు. నీతి ఆయోగ్‌ను నిరర్థకంగా మార్చిన వైఖరికి నిరసనగా భేటీకి వెళ్లట్లేదని స్పష్టం చేశారు.
మరోవైపు నితీశ్ కుమార్ కూడా హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. నితీశ్ నేతృత్వంలోని జేడీయూ.. కేంద్రంలో, బిహార్‌లో జాతీయ ప్రజాస్వామ్య కూటమిలో భాగస్వామి. అయితే.. మిత్రపక్షాల మధ్య దూరం పెరిగినట్లు ఇటీవల వార్తలు వినిపించాయి. ముఖ్యంగా.. రాష్ట్రపతి ఎన్నికల సమయంలోనూ రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. అవన్నీ తోసిపుచ్చుతూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ముకే జేడీయూ మద్దతు ఇచ్చింది. ఇంతలోనే.. నీతి ఆయోగ్ భేటీకి నితీశ్ వెళ్లకపోవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.