కరోనా టీకా వినియోగానికి శాస్త్రవేత్తల అనుమతి లభించిన వెంటనే.. వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సిన్ పంపిణీపై చర్చించేందుకు వర్చువల్‌గా ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీలో మోదీ.. ఈ మేరకు స్పష్టం చేశారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
కొవిడ్-19 వ్యాక్సిన్ వచ్చేందుకు ఇక ఎంతోకాలం పట్టదని, కొన్నివారాల్లోనే సిద్ధం అవుతుందని నిపుణులు చెప్పినట్లు మోదీ తెలిపారు.
"వ్యాక్సిన్ టీకా ధరపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం చర్చిస్తోంది. ప్రజా ఆరోగ్యమే అన్నింటికన్నా ముఖ్యం. ధర నిర్ణయంలో అదే మా తొలి ప్రాధాన్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు టీకా పంపిణీకి పనిచేస్తున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే వ్యాక్సిన్ సామర్థ్యం, పంపిణీ విషయంలో మన దేశం ముందంజలో ఉంది. వ్యాక్సిన్ రంగంలో మనకు చాలా అనుభవం ఉంది. కొద్ది వారాల్లోనే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని నిపుణులు అంటున్నారు. వారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే పంపిణీ ప్రారంభిస్తాం.
వ్యాక్సిన్ సామర్థ్యంపై మన శాస్త్రవేత్తలు అపారమైన విశ్వాసం ప్రకటించారు. ప్రపంచం మొత్తం ఇప్పుడు భారత్‌వైపే చూస్తోంది. చౌకగా వ్యాక్సిన్ అందించగలిగే సామర్థ్యం భారత్‌కే ఉంది. మీ విలువైన సూచనలు, సలహాలను లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి అందజేయాలని అన్ని పార్టీల నేతలను నేను కోరుతున్నాను. మీ సలహాలకు ప్రాధాన్యం ఉంటుందని నేను హామీ ఇస్తున్నాను."
- నరేంద్ర మోదీ, ప్రధాని
కరోనా టీకాను తొలుత కోటి మందికిపైగా ఆరోగ్య సిబ్బందికి ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది. ఆ తర్వాత కొవిడ్ పోరులో ముందుండి పోరాడుతున్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే మోదీ సర్కార్.. అన్ని పార్టీలకు తెలియజేసినట్లు సమాచారం.