లూడో మొబైల్ గేమ్‌కు సంబంధించి వివరణ ఇవ్వాలని మహారాష్ట్ర సర్కారుకు నోటీసులు జారీ చేసింది బాంబే హైకోర్టు. లూడోను నిషేధించాలంటూ పిటిషన్ దాఖలైన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. జూన్ 22లోగా సమాధానం ఇవ్వాలని స్పష్టం చేసింది.
మహారాష్ట్ర నవ్‌నిర్మాణ్ సేనా నేత కేశవ్ మూలే.. లూడో రూపకర్తలపై చర్యలు తీసుకోవాలని తొలుత పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు స్పందించని కారణంగా.. మెజిస్ట్రేట్ కోర్టును ఆశ్రయించారు. లూడోను నిషేధించాలని కోరారు.
అయితే లూడో.. నైపుణ్యం గల ఆట అని చెప్పి మూలే పిటిషన్‌ను కోట్టేసింది మెజిస్ట్రేట్ కోర్టు. దీంతో.. గేమ్ నిషేధంపై బాంబే హైకోర్టులో క్రిమినల్ పిటిషన్ వేశారు మూలే. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ షిండే, జస్టిస్ అభయ్ అహుజా నేతృత్వంలోని ధర్మాసనం.. లూడోకు సంబంధించిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.
లూడో యువతను తప్పుదోవపట్టిస్తోందని పిటిషనర్ తరఫు న్యాయవాది తన వాదనలు వినిపించారు.
ఇదీ చదవండి:'అల్లోపతిలో కరోనిల్ చేరితే అది.. మిక్సోపతి'