Plane Tire Burst: విమానం టైర్ పగిలిపోవడం వల్ల ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. లోహ్గావ్ విమానాశ్రయం నుంచి సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం ఎగిరిన కాసేపటికే టైర్ పేలిపోయింది. దీంతో పుణెలో ల్యాండింగ్ సమయంలో రన్‌వే దెబ్బతింది. ఇతర విమానాల రాకపోకలకు కూడా అడ్డంకిగా మారింది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులంతా పెద్దఎత్తున విమానాశ్రయం వద్ద గుమిగూడారు. ఈ సంఘటనపై స్పందించిన విమానాశ్రయం డైరెక్టర్.. దీని గురించి తనకేం తెలియదని చెప్పడం గమనార్హం. రన్‌వే భారత వాయుసేన(ఐఏఎఫ్) నియంత్రణలో ఉంటుందని, ఇతర సమాచారం కోసం వారినే సంప్రదించాలని అన్నారు.
దీంతో ప్రయాణికులు మరింత నిరాశ చెందారు. టైర్ పేలిపోయి అడ్డంకి ఏర్పడిన కారణంగా.. ఇతర విమానయాన సంస్థలు కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. ఈ అంతరాయంతో.. ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. రోజూ ఇక్కడ 70 నుంచి 80 విమానాలు రాకపోకలు సాగిస్తూ ఉంటాయి. ఈ ఘటనతో షెడ్యూల్ మొత్తం తారుమారైంది. ఐఏఎఫ్ సిబ్బంది వచ్చి రన్‌వేను క్లియర్ చేశారు. అనంతరం.. విమాన కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి.