తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'డొక్కు స్కూటర్​, రబ్బరు చెప్పులతో తిరిగి రూ.వందల కోట్లు దాచాడా?' - పీయూష్​ జైన్ న్యూస్​

Peeyush Jain news: రూ. వందల కోట్ల నల్లధనం కూడబెట్టిన వ్యాపారవేత్త పీయూష్​ జైన్​ ఎంతో నిరాడంబరంగా జీవిస్తారని అతని స్వగ్రామస్థులు చెప్పారు. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు హాజరైనప్పుడు కుర్తా పైజామా, రబ్బరు చెప్పులు ధరించి ఓ సాధారణ వ్యక్తిలా పాత స్కూటర్​పై వచ్చేవారని తెలిపారు. ఆయన వందల కోట్లు నల్లధనం కూడబెట్టారంటే నమ్మలేకపోతున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Peeyush Jain, పీయూష్​ జైన్
పీయూష్​ జైన్

By

Published : Dec 28, 2021, 8:40 PM IST

Peeyush Jain news: జీఎస్​టీ ఎగవేత కేసులో అరెస్టయిన ప్రముఖ వ్యాపారవేత్త పీయూష్​ జైన్​ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు ఆయన సొంతూరు కన్నౌజ్​లోని స్థానికులు. వారు చెప్పింది వింటే డొక్కు స్కూటర్​, రబ్బరు చెప్పులతో తిరిగేవాడు ఇంత ఘరానా మోసం చేశాడా అనే అనుమానం కలగక మానదు. పీయూష్​ నిరాడంబరుడని.. పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు హాజరైనప్పుడు కుర్తా పైజామా, రబ్బరు చెప్పులు ధరించి ఓ సాధారణ వ్యక్తిలా ఎల్​ఎంఎల్​ స్కూటర్​పై వచ్చేవారని ఛిపత్తా వాసులు తెలిపారు. ఆయన వందల కోట్లు పన్ను ఎగవేశారంటే నమ్మలేకపోతున్నామని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

పీయూష్‌ జైన్‌ గత 20ఏళ్లుగా సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేస్తున్నాడు. ఉత్తర్​ప్రదేశ్​తో పాటు ముంబయి, గుజరాత్‌లలోనూ ఆయనకు బిజినెస్‌లు ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి కోట్లలో ఆదాయం వస్తుంది. అయినప్పటికీ పీయూష్‌ మాత్రం సాదాసీదాగానే ఉండేవాడట. తన ఇంటి ముందు టయోటా క్వాలిస్‌, మారుతి వంటి రెండు పాత మోడల్‌ కార్లు పార్క్‌ చేసి ఉంటాయట. ఇక తన పూర్వీకుల ఊరు కన్నౌజ్‌కు ఎప్పుడు వెళ్లినా పాత బజాజ్‌ ప్రియ స్కూటర్‌పైనే తిరుగుతారని స్థానికులు చెప్పారు.

పీయూష్ పొరుగింటి వారు చెప్పిన వివరాల ప్రకారం ఆయన తండ్రి మహేశ్​ చంద్ర జైన్​ ఓ కెమిస్ట్. ఆయన నుంచే పీయూష్, అతని సోదరుడు అంబ్రిష్ సుగంధ ద్రవ్యాలు ఎలా తయారు చేయాలో నేర్చుకున్నారు. అనంతరం ఒడోకామ్​ కెమికల్స్ పేరుతో సంస్థను ప్రారంభించారు. పీయూష్​ తల్లి రెండేళ్ల క్రితమే మరణించారు. పీయూష్ అతని సోదరుడు రెండు ఇళ్లను కొనుగోలు చేసి వాటిని ఒక్క ఇల్లుగా మార్చారు. ఇప్పుడు దాని విస్తీర్ణం 800 చదరపు గజాలు. పీయూష్ తండ్రి, సంస్థ సిబ్బంది ఈ ఇంట్లోనే ఉంటారని స్థానికులు చెబుతున్నారు. మహేష్​ చంద్ర జైన్​ ఇప్పటికీ సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తున్నారని వివరించారు. వాటిని తీసుకెళ్లి వ్యాపారం చేయడానికి, సుగంధ ద్రవ్యాలకు అవసరమైన ముడి సరకులు అందించడానికి మాత్రమే పీయూష్​ సోదరులు ఇంటికే వచ్చేవారని చెప్పారు. ఇతర వ్యాపారులతో పోల్చితే పీయూష్​ ఇల్లు చాలా హుందాగా ఉండేదని, బయటి నుంచి చూస్తే లోపల ఏం జరుగుతుందో తెలియనంత మిస్టిరీయస్​గా ఉంటుందని పేర్కొన్నారు. పీయూష్​కు కాన్పుర్​లోని ఆనందపురిలో మరో ఇల్లు ఉంది.

అయితే ఎంతో నిరాడంబరంగా కన్పించే పీయూష్‌ జైన్‌ పన్ను ఎగవేత వ్యవహారం ఉత్తరప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆయన ఇంట్లో బయటపడిన నోట్ల గుట్టలను చూసి అధికారులే నోరెళ్లబెట్టారు. బ్యాంకు అధికారులు నాలుగు రోజులు కూర్చుని 20 కౌంటింగ్‌ మిషన్లతో కుస్తీపడితే రూ.257కోట్లుగా లెక్క తేలింది. దేశంలోనే ఇప్పటివరకు దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న అత్యంత విలువైన నగదు ఇదే కావడం గమనార్హం. మరి ఈ ఘరానా మోసం ఎలా బయటపడింది..? తప్పుడు బిల్లులతో పన్ను ఎగవేతకు పాల్పడిన పీయూష్‌ కూడబెట్టిన సొమ్మును అధికారులు ఎలా పట్టుకున్నారు..? అన్న విషయాలను డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్‌టీ ఇంటెలిజెన్స్‌(డీజీజీఐ) అధికారులు తాజాగా వెల్లడించారు.

పీయూష్​ జైన్

తీగ లాగితే..

కొద్ది రోజుల క్రితం కాన్పుర్‌లో జీఎస్‌టీ చెల్లించకుండా సరఫరా చేస్తున్న, నాలుగు పొగాకు, పాన్‌ మసాలా ట్రక్కులను డీజీజీఐ అధికారులు గుర్తించారు. ఈ ట్రక్కులు గణపతి రోడ్‌ క్యారియర్‌కు చెందినవి. ఈ కేసు విచారణలో భాగంగా అధికారులు శిఖర్‌ పాన్‌ మసాలా ఫ్యాక్టరీకి వెళ్లారు. అక్కడ గణపతి రోడ్‌ క్యారియర్‌ పేరుతో దాదాపు 200లకు పైగా నకిలీ ఇన్‌వాయిస్‌లను అధికారులు గుర్తించారు. దీనిపై శిఖర్‌ పాన్‌ మసాలా కంపెనీ యాజమాన్యాన్ని విచారించగా.. పన్ను చెల్లించలేదని వారు అంగీకరించారు. అప్పటికప్పుడు రూ.3.09కోట్లను కూడా డిపాజిట్ చేశారు. అదే సమయంలో శిఖర్‌ పాన్‌ మసాలాలో ఒడోకామ్‌ ఇండస్ట్రీస్‌ వాటాలు ఉన్నట్లు తెలిసింది. అప్పుడే పీయూష్‌ జైన్‌ పేరు బయటికొచ్చింది.

బీరువాలో భద్రంగా..

ఒడోకామ్‌ ఇండస్ట్రీస్‌కు పీయూష్‌ జైన్‌ యజమాని. నకలీ ఇన్‌వాయిస్‌లు, ఈ-వే బిల్లుల ద్వారా ఈ రెండు కంపెనీలు తమ ఉత్పత్తులను సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. దీంతో వెంటనే అధికారులు ఒడోకామ్‌ రిజిస్ట్రర్డ్‌ అడ్రస్‌ అయిన పీయూష్‌ ఇంటికి వెళ్లారు. తనిఖీలు చేస్తుండగా ఆయన ఇంట్లో మూడు నోట్ల లెక్కింపు యంత్రాలు, రెండు అల్మారాలను గుర్తించారు. ఆ అల్మారాలను తెరిచి చూడగా.. అందులో నీట్‌గా ప్యాక్‌ చేసిన నోట్ల కట్టలు కన్పించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు.. అక్కడే లెక్కింపు చేపట్టారు. ఇందుకోసం ఎస్‌బీఐ అధికారులను పిలిపించారు. వీరంతా నాలుగు రోజుల పాటు 20 కౌంటింగ్‌ మిషన్లతో లెక్క బెట్టగా.. మొత్తం విలువ రూ.257 కోట్లుగా తేలింది. ఇందులో రూ.177.45కోట్లు లెక్కల్లో చూపని సొమ్ముగా తేల్చారు. దీంతో పాటు 23 కిలోల బంగారం, 250 కిలోల వెండి, రహస్యంగా దాచిన 600 కిలోల గంధపు చెక్కల నూనెను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:బ్యాంకు మాజీ ఛైర్మన్​పై ఈడీ కొరడా.. రూ.294కోట్ల ఆస్తులు జప్తు

ABOUT THE AUTHOR

...view details