పతంజలి విడుదల చేసిన కొరొనిల్ టాబ్లెట్ వివాదంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి అండగా నిలిచింది దిల్లీ వైద్య సంఘం (డీఎంఏ). కొరొనిల్ విడుదల కార్యక్రమానికి కేంద్ర మంత్రి హాజరవటాన్ని తప్పుపట్టిన భారతీయ వైద్య సంఘం (ఐఎంఏ) తీరు సరికాదని పేర్కొంది. ఆయన గౌరవాన్ని దెబ్బతీసేందుకు నిరాధార ఆరోపణలు చేసిందని విమర్శించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది డీఎంఏ.
" కొవిడ్-19 చికిత్స కోసమంటూ పతంజలి అభివృద్ధి చేసిన కొరొనిల్ ఔషధం విడుదల కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ హాజరయ్యారు. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నుంచి కొరొనిల్.. సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాసుటికల్ ప్రొడక్ట్ (కాప్)ను పొందింది. కొరొనిల్ ఔషధాన్ని హర్షవర్ధన్ ప్రోత్సహించలేదు. కానీ ఆయుర్వేద శాస్త్రీయ ఆధారాల ఆధారిత వైద్య వ్యవస్థను రూపొందించటంపైనే దృష్టి పెట్టారు. ఇది ఆధునిక వైద్య విధానంతో పాటు ఇతర వైద్య విధానాలనూ ప్రోత్సహిస్తుంది. "
- దిల్లీ వైద్య సంఘం
ఐఎంఏకు ఆయుర్వేద ఔషధ ప్రయోగ అంశాలను ప్రశ్నించే అధికారం లేదని పేర్కొంది డీఎంఏ. ప్రయోగాలు ఎలా నిర్వహించారు? ఎక్కడ చేపట్టారు? ఇందులో ఎంత మంది రోగులు పాలుపంచుకున్నారు? వంటి అంశాలను పరిశీలించేందుకు సంబంధిత విభాగాలు ఉన్నాయి కానీ, ఐఎంఏ కాదని స్పష్టం చేసింది. చీప్ పబ్లిసిటీ కోసమే ఆరోగ్య మంత్రిపై ఐఎంఏ కల్పిత ఆరోపణలు చేసిందని విమర్శించింది డీఎంఏ. ఐఎంఏలో అంకితభావం, నిజాయతీ గల సభ్యుడిగా ఎంతో కృషి చేసి హర్షవర్ధన్ కేంద్ర మంత్రిగా ఎదిగారని గుర్తు చేసింది. ఒక స్వచ్ఛంద సంస్థగా తమ సభ్యులపై చర్యలు తీసుకునే అధికారం ఐఎంఏకు లేదని సూచించింది. భారతీయ వైద్య మండలి సైతం తమ సభ్యులపై వృత్తిపరంగా చర్యలు తీసుకోగలదు కానీ, మంత్రివర్గంలోని వారిపై తీసుకోలేదని గుర్తు చేసింది.
'కొరొనిల్కు కాప్ లైసెన్స్'
కొరొనిల్ను విడుదల చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ హాజరుకావటంపై వివాదం చెలరేగిన క్రమంలో తమకు ప్రపంచ ఆరోగ్య సంస్థ-జీఎంపీ ప్రకారం సర్టిఫికేట్ ఆఫ్ ఫార్మాసుటికల్ ప్రొడక్ట్ (కాప్) లైసెన్స్ లభించిందని వెల్లడించింది పతంజలి. డాక్టర్ హర్షవర్ధన్ ఏ ఆయుర్వేద ఔషధాన్ని ఆమోదించలేదని, ఏ ఆధునిక ఔషధాలను అణగదొక్కలేదని తెలిపారు పతంజలి పరిశోధన పౌండేషన్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి ఆచార్య బాలక్రిష్ణ.
ఇదీ చూడండి:'కొరొనిల్'తో కేంద్ర ఆరోగ్య మంత్రికి చిక్కులు!