బంగాల్‌లోని కోల్‌కతా విమానాశ్రయం వద్ద విస్తారా విమానానికి పెను ప్రమాదం తప్పింది. ల్యాండింగ్‌కు 15 నిమిషాల ముందు విమానంలో భారీ కుదుపులు చోటుచేసుకోవడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ భారీ కుదుపుల నేపథ్యంలో ముగ్గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో 8మందికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. ముంబయి నుంచి బయల్దేరిన UK 775 విమానం కోల్‌కతాలో ల్యాండ్ కావడానికి 15 నిమిషాల ముందు భారీ కుదుపులకు గురైంది. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై విస్తారా సంస్థ అధికార ప్రతినిధి స్పందించారు. తమ కస్టమర్లకు ఇలాంటి దురదృష్టకరమైన అనుభవం ఎదురవ్వడం పట్ల తమ సంస్థ విచారం వ్యక్తం చేస్తోందని తెలిపారు. ఈ ఘటనలో గాయపడి ఆస్పత్రిలో చేరిన వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తదుపరి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.