Maharashtra Power Outage: ముంబయి సహా మహారాష్ట్రలోని ఠాణె, కల్యాణ్ వంటి పలు కీలక నగరాల్లో విద్యుత్ సరఫరా గంటకుపైగా నిలిచిపోయింది. ట్రాన్స్మిషన్ లైన్ ట్రిప్పింగ్ వల్ల మంగళవారం ఉదయం ఈ పరిస్థితి వచ్చింది. మహారాష్ట్ర.. దాదాపు 2,500 మెగావాట్ల విద్యుత్ లోటుతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ఈ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ లోటు వల్ల రాష్ట్ర డిస్కం కొన్ని నగరాలకు గంటలపాటు సరఫరా నిలిపివేయడం అనివార్యమైంది. ఈ ఏడాది ఫిబ్రవరి, 2020 అక్టోబర్‌లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది.
ముంబయిలో కరెంట్ కట్.. గంటలపాటు ప్రజలకు అవస్థలు! - మహారాష్ట్ర వార్తలు
Mumbai Power Cut: దేశ ఆర్థిక రాజధాని ముంబయిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా గంటకుపైగా నిలిచిపోయింది. మరికొన్ని ప్రాంతాల్లోనూ ఇదే సమస్య తలెత్తింది.
మంగళవారం విద్యుత్ సరఫరా నిలిచిపోయిన ప్రాంతాల్లో ముంబయిలోని దాదర్, మాటుంగా, భాండప్, ములుండ్ ఉన్నాయి. మెట్రోపాలిటన్ చట్టుపక్కల ప్రాంతాలైన ఠాణె, కల్యాణ్, డోంబివలిలో ఉదయం 10 గంటల నుంచి గంటకుపైగా కరెంటు నిలిపోయింది. కల్యాణ్ సమీపంలోని పడ్ఘా సబ్‌స్టేషన్‌లో సమస్య తలెత్తడం వల్లే సరఫరా ఆగిపోయిందని అధికారులు తెలిపారు. గంట తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాల్లో కరెంటు సరఫరా పునరుద్ధరించినట్లు పేర్కొన్నారు. ఆర్థిక రాజధాని ముంబయిలో సాధారణంగా కరెంటు కోతలు ఉండవు. కానీ కొన్నిసార్లు ఊహించని సమస్యలు తలెత్తడం వల్ల విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. 2020 అక్టోబర్‌లో ముంబయి నగరం దాదాపు 18 గంటలపాటు అంధకారంలో ఉంది.
ఇదీ చదవండి:రెండు వారాలకే పాడయిన ఎలక్ట్రిక్ స్కూటర్.. గాడిదకు కట్టి ఊరేగింపు..!