తెలంగాణ

telangana

ETV Bharat / bharat

విపక్షాల ఆందోళనలతో దద్ధరిల్లిన ఉభయ సభలు - పార్లమెంట్ సమావేశాలు లైవ్ తెలుగు

PARLIAMENT SESSION
పార్లమెంట్ సమావేశాలు

By

Published : Jul 19, 2021, 10:55 AM IST

Updated : Jul 19, 2021, 5:21 PM IST

16:50 July 19

ఉభయ సభలు మంగళవారానికి వాయిదా

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల తొలిరోజున ఉభయ సభలు ఎలాంటి కార్యకలాపాలు సాగించకుండానే వాయిదా పడ్డాయి. ఇంధనధరల పెంపు, సాగుచట్టాలు సహా పలు అంశాలపై విపక్షసభ్యులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో అంతరాయం కలిగింది. 

లోక్​సభలో వాయిదాల పర్వం..

విపక్షాల ఆందోళనలతో లోక్‌సభలో వాయిదాల పర్వం నడిచింది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కొత్తగా ఎన్నికైన నలుగురు సభ్యులు ప్రమాణం చేశారు. ఆ తర్వాత ప్రధాని మోదీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. ప్రధాని మాట్లాడటం మొదలుపెట్టగానే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. చమురు ధరలు, కరోనా ఇతర అంశాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో స్పీకర్‌ కల్పించుకుని ప్రతిపక్ష సభ్యులను వారించే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ విపక్షసభ్యులు నినాదాలు కొనసాగించగా.. ఆందోళనల మధ్యే ప్రసంగాన్ని కొనసాగించిన మోదీ.. మహిళలు, ఓబీసీలు, రైతుల బిడ్దలు మంత్రులు కావడం కొందరికి ఇష్టం లేదని, అందుకే వారిని సభకు పరిచయం చేయకుండా అడ్డుకుంటున్నారంటూ విపక్షాలపై మండిపడ్డారు. 

ఇటీవల మరణించిన ఎంపీలు, పార్లమెంట్‌ మాజీ సభ్యులకు లోక్‌సభ సంతాపం ప్రకటించింది. ఆ తర్వాత స్పీకర్‌ ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టగా ప్రతిపక్షాలు ఆందోళనలకు దిగడం వల్ల మరోమారు వాయిదా పడింది. 

ఫోన్​ ట్యాపింగ్​పై కీలక ప్రకటన..

కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, పాత్రికేయులు సహా మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలపై కేంద్రం లోక్​సభలో కీలక ప్రకటన చేసింది. ఈ ఆరోపణలు రావడాన్ని భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాల్జేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా అభివర్ణించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. ప్రస్తుతం దేశంలో ప్రతి అంశానికి సంబంధించి కచ్చితమైన నియమనిబంధనలు ఉన్నాయని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. 

ఇదే సమయంలో విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. మంత్రి ప్రకటన చేయడం ముగియగానే లోక్​సభను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా.

రాజ్యసభలో..

ఉదయం సభ ప్రారంభమయ్యాక.. చనిపోయిన సిట్టింగ్‌ ఎంపీలు రఘునాథ్ మహాపాత్ర, రాజీవ్ సతావ్ సహా మరో పది మంది మాజీ ఎంపీలకు రాజ్యసభ సంతాపం తెలిపింది. ప్రముఖ నటులు దిలీప్ కుమార్, పరుగుల వీరుడు మిల్కాసింగ్ మృతిపై సంతాపం వ్యక్తం చేసింది. తర్వాత  సిట్టింగ్ ఎంపీలకు సంతాప సూచకంగా గంటపాటు వాయిదా పడింది. 

ఆ తర్వాత 12 గంటల 25 నిమిషాలకు సభ ప్రారంభం కాగానే పెట్రో ధరల పెంపు, నూతన సాగుచట్టాలు సహా వేర్వేరు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. మొదట రెండింటి వరకు సభ వాయిదాపడింది. తర్వాత సభ ప్రారంభం కాగానే ప్రధాని నరేంద్రమోదీ నూతన మంత్రులను సభకు పరిచయం చేసే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో విపక్షాలు ఆందోళన కొనసాగించగా ప్రధాని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తగా మంత్రులైన మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు గౌరవం ఇవ్వకుండా అడ్డుకునేలా విపక్షసభ్యుల వైఖరి ఉందని మండిపడ్డారు. 

" మంత్రులుగా నియమితులైన రైతు బిడ్డలను ఈ సభకు పరిచయం చేయాల్సిన సందర్భమిది. కొందరు దీనిని వ్యతిరేకిస్తున్నారు. మహిళా మంత్రులను పరిచయం   చేయాల్సి ఉంది. కానీ మహిళా వ్యతిరేక మనస్తత్వం ఉన్నకొందరు మహిళల పేర్లు కూడా వినపడకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. వారిని పరిచయం చేయడానికి కూడా సిద్ధంగా లేరు. ఆదివాసీ మంత్రుల పరిచయం చేయాల్సి ఉంది. దానిని జరగనివ్వడం లేదు. ఇదేం మనస్తత్వం? దళితులకు గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఆదివాసీలకు గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. రైతుబిడ్డలకు గౌరవం ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇదేం మనస్తత్వం? ఇలాంటి పరిస్థితిని సభలో తొలిసారిగా చూస్తున్నా." 

 - నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి. 

ఈ దశలో మూడింటి వరకు వాయిదాపడిన సభ తర్వాత కూడా ప్రతిపక్షాల ఆందోళన కొనసాగగా.. మంగళవారానికి వాయిదాపడింది.

15:52 July 19

కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు, పాత్రికేయులు సహా మరికొందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలపై కేంద్రం లోక్​సభలో కీలక ప్రకటన చేసింది. ఈ ఆరోపణలు రావడాన్ని... భారత ప్రజాస్వామ్యాన్ని అప్రతిష్ఠపాల్జేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా అభివర్ణించారు కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్. ప్రస్తుతం దేశంలో ప్రతి అంశానికి సంబంధించి కచ్చితమైన నియమనిబంధనలు ఉన్నాయని, అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం అసాధ్యమని స్పష్టం చేశారు. 

ఇదే సమయంలో విపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. మంత్రి ప్రకటన చేయడం ముగియగానే... లోక్​సభను మంగళవారానికి వాయిదా వేశారు స్పీకర్​ ఓం బిర్లా.

15:42 July 19

విపక్ష సభ్యుల ఆందోళనతో లోక్​సభ రేపటికి వాయిదా పడింది. మంగళవారం ఉదయం 11గంటలకు సభ తిరిగి ప్రారంభం కానుంది.

15:29 July 19

రేపటికి వాయిదా

విపక్షాల ఆందోళనలు ఆగని నేపథ్యంలో పెద్దల సభను మంగళవారానికి వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు. రేపు ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కానుంది.

14:13 July 19

అటు.. రాజ్యసభ సైతం విపక్షాల ఆందోళనలతో వాయిదా పడింది. మధ్యాహ్నం 3 గంటల వరకు పెద్దలసభను వాయిదా వేశారు ఛైర్మన్ వెంకయ్య నాయుడు.

14:07 July 19

లోక్​సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. విపక్ష సభ్యుల ఆందోళనతో తొలుత మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడిన సభ.. తిరిగి భేటీ అయిన తర్వాత కూడా సజావుగా సాగలేదు. దీంతో సభను మధ్యాహ్నం 3.30కు వాయిదా వేశారు స్పీకర్ ఓంబిర్లా. 

12:50 July 19

మరోసారి

రాజ్యసభ రెండోసారి వాయిదా పడింది. ప్రముఖుల మరణాల పట్ల సంతాపం ప్రకటించిన తర్వాత తొలుత వాయిదా పడిన రాజ్యసభ... గంట తర్వాత తిరిగి సమావేశమైంది. అయితే, విపక్షాల ఆందోళనల నేపథ్యంలో సభ మరోసారి వాయిదా పడింది.

11:36 July 19

సభ్యుల ఆందోళన నేపథ్యంలో లోక్​సభ వాయిదా పడింది. మధ్యాహ్నం రెండు గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లు లోక్​సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు.

11:31 July 19

రాజ్యసభ వాయిదా

నటుడు దిలీప్ కుమార్, అథ్లెట్ మిల్కా సింగ్ సహా ఈ ఏడాది ప్రాణాలు కోల్పోయిన ప్రముఖులకు రాజ్యసభ సభ్యులు సంతాపం తెలిపారు. అనంతరం సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.24 గంటలకు రాజ్యసభ మళ్లీ భేటీ కానుంది.

11:16 July 19

విపక్షాల నినాదాల మధ్యే మోదీ ప్రసంగం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. లోక్​సభలో ప్రసంగించారు. చాలా మంది మహిళలు, దళితులు, ఆదివాసీలు.. మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారని మోదీ పేర్కొన్నారు. ఓబీసీలు, గ్రామీణ, వ్యవసాయ నేపథ్యం ఉన్న వ్యక్తులకు మంత్రివర్గంలో స్థానం కల్పించినట్లు చెప్పారు.

అయితే, మంత్రులను సభకు పరిచయం చేస్తున్న సమయంలో విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. ప్రధాని ప్రసంగిస్తుండగానే నినాదాలు చేశారు. ఈ ఆందోళనల మధ్యే మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. "దేశంలోని మహిళలు, ఓబీసీలు మంత్రులుగా బాధ్యతలు చేపట్టడం పట్ల కొందరు వ్యక్తులు సంతోషంగా లేనట్టు కనిపిస్తోంది. అందుకే వారు మంత్రుల పరిచయ ప్రసంగాన్ని సైతం అడ్డుకుంటున్నారు." అని వ్యాఖ్యానించారు.

10:03 July 19

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్​సభ, రాజ్యసభ ఉదయం 11 గంటలకు ఒకేసారి సమావేశమయ్యాయి. కేంద్ర మంత్రులు సహా కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చినవారు పార్లమెంట్​కు చేరుకున్నారు. నూతన మంత్రులను.. ప్రధాని మోదీ సభకు పరిచయం చేయనున్నారు.

వచ్చే నెల 13 వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. పెట్రో ధరల పెరుగుదల, సాగు చట్టాల రద్దు, రఫేల్‌ ఒప్పందంపై దర్యాప్తు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని తాజా సమావేశాల్లో ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమమయ్యాయి. వాటిని దీటుగా ఎదుర్కొనేందుకు అధికార పక్షం పక్కా ప్రణాళికలు రూపొందించుకుంది.

నేడు ప్రవేశపెట్టనున్న బిల్లులివే

'నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్​ప్రెన్యూర్​షిప్ అండ్ మేనేజ్​మెంట్ బిల్లు'ను కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి పశుపతి కుమార్ పరాస్.. నేడు లోక్​సభలో ప్రవేశపెట్టనున్నారు.

ఫాక్టరింగ్ రెగ్యులేషన్(సవరణ) బిల్లును లోక్​సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.

విపక్ష నేతల నోటీసులు

మరోవైపు, కేంద్ర మంత్రులు, విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్​కు సంబంధించిన అంశాన్ని సభలో తప్పకుండా లేవనెత్తుతామని కాంగ్రెస్​ లోక్​సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురి స్పష్టం చేశారు. దేశ భద్రతకు ముప్పు ఉందని ధ్వజమెత్తారు. ఈ విషయంపై చర్చించాలంటూ సీపీఐ రాజ్యసభ ఎంపీ బినోయ్ విశ్వం.. పెద్దల సభలో నోటీసు ఇచ్చారు.

అదేసమయంలో, కరోనా మరణాలపై ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, ఇంధన ధరలపై కాంగ్రెస్ ఎంపీ మానికం ఠాకూర్, వ్యవసాయ చట్టాలపై కాంగ్రెస్, ఆప్ ఎంపీలు మనీశ్ తివారి, భగవంత్ మన్​లు నోటీసులు ఇచ్చారు. నిత్యావసరాల ధరల పెరుగుదల నేపథ్యంలో ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో వివరించాలని కాంగ్రెస్ రాజ్యసభాపక్ష నేత కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. దీనిపై చర్చ జరపాలంటూ నోటీసు ఇచ్చారు.

'నోటీసులు వాటి కోసం ఇవ్వండి'

అయితే, నిర్మాణాత్మక చర్చల కోసం నోటీసులు ఇవ్వాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి పేర్కొన్నారు. ప్రభుత్వం చర్చల నుంచి పారిపోవడం లేదని అన్నారు. 'అర్థవంతమైన చర్చ జరగాలని ప్రధాని మోదీ నిన్ననే చెప్పారు. దాన్నే మా ప్రభుత్వం విశ్వసిస్తోంది' అని తెలిపారు.

Last Updated : Jul 19, 2021, 5:21 PM IST

ABOUT THE AUTHOR

...view details