Parliament Budget Session 2024 Date : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 9వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వెల్లడించారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యంతర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఏప్రిల్- మేలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. జనవరి 31న భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీంతో అధికారికంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతాయి.
ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చే చివరి పద్దు ఇదే. లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. అంటే కొత్త ప్రభుత్వం కొలువుదీరే వరకు చేయాల్సిన ఖర్చులకు పార్లమెంట్ ఆమోదం తీసుకోవడమే. ఈ సంప్రదాయం బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతోంది. అయితే ఈ బడ్జెట్లో ఆకర్షణీయమైన ప్రకటనలు, విధానపరంగా కీలకమైన మార్పులు ఉండకపోవచ్చని ఇప్పటికే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు.