Parliament Attack Accused Mastermind Manoranjan :పార్లమెంట్లో అలజడి ఘటనలో ప్రధాన కుట్రదారు డి.మనోరంజనేనని దిల్లీ ప్రత్యేక విభాగం పోలీసులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా లభించినట్లు తెలుస్తోంది. ఏదైనా ఒక సంచలనాత్మక ఘటన ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పెద్ద సందేశం పంపించాలనే ఉద్దేశంతోనే లోక్‌సభలో అలజడికి నిందితులు ఈ కుట్ర పన్ని ఉంటారని భావిస్తున్నారు. పన్నాగం అమలుకు నిందితులను ఒప్పించడంలోనూ మనోరంజన్ కీలకంగా వ్యవహరించాడని తెలుస్తోంది. పోలీసులు అరెస్టు చేసిన ఆరుగురు నిందితుల్లో ఒకడైన లలిత్ ఝా దర్యాప్తులో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. పార్లమెంట్ ఘటన తర్వాత ఆధారాలను చెరిపివేసే బాధ్యతను మాత్రమే తనకు అప్పగించారని లలిత్ విచారణ సమయంలో పేర్కొన్నాడని తెలుస్తోంది.
ఈ నెల 13న పార్లమెంటు లోపల దాడికి ప్రయత్నించి సాగర్ శర్మతో పాటు మనోరంజన్ భద్రతా సిబ్బందికి పట్టుబడ్డారు. ఇక సంవత్సరం క్రితం తాము మైసూరు వెళ్లేందుకు టికెట్లను సమకూర్చింది కూడా మనోరంజనేనని లలిత్ ఝా తెలిపాడు. నిందితులు అందరికీ శుక్రవారం మానసిక విశ్లేషణ పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నిరుద్యోగ సమస్య, రైతుల ఉద్యమం, మణిపుర్ సంక్షోభం వంటివి తమను తీవ్ర నిరాశకు గురిచేశాయని నిందితులు చెప్పినట్లు తెలిపారు. అయితే, పార్లమెంటుపై దాడి ఘటనకు సంబంధించి సహేతుకమైన కారణాలను ఇంకా తెలుసుకోవాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. శుక్రవారం లలిత్ ఝాను కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు లలిత్ను 14 రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. నిందితులకు ఆశ్రయమిచ్చిన విశాల్ కూడా పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు.