వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లుపై(Personal data protection bill 2019) నివేదికకు సంయుక్త పార్లమెంటరీ సంఘం (జేసీపీ) విపక్షాల అసమ్మతి నడుమ సోమవారం ఆమోదం తెలిపింది. వ్యక్తుల సమాచారాన్ని ఏ విధంగా భద్రపరచాలి? ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎంతవరకు వీటిని తీసుకోవచ్చు? అనే అంశాలపై అధ్యయనం చేసింది. దేశ భద్రత తదితర సందర్భాల్లో ఏ వ్యక్తి నుంచీ అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలైన పోలీసులు, సీబీఐ, ఈడీ, రా, ఐబీలతో పాటు ఆధార్ కార్డులు ఇచ్చే ఉడాయ్, ఆదాయపు పన్ను శాఖ, ఇతర ప్రభుత్వాలు కూడా వారి సమాచారం తీసుకోవచ్చని (Personal data protection bill committee) ప్రతిపాదించింది. ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు మాత్రం తప్పకుండా వ్యక్తుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
తప్పుడు మార్గాల్లో సమాచారం తీసుకుంటే.. చిన్నకేసుల్లో అయితే రూ.5 కోట్లు, లేదా ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 2% మేర జరిమానా ఉంటుంది. పెద్ద కేసుల్లో అయితే రూ.15 కోట్లు, ప్రపంచ వ్యాప్త టర్నోవర్‌లో 4% మేర చెల్లించాల్సి ఉంటుంది. 2017లో వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటించిన సుప్రీంకోర్టు.. సమాచార పరిరక్షణకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.ఎన్.కృష్ణ ఆధ్వర్యంలో నిపుణుల సంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా బిల్లు (Parliament bills) రూపొందించి 2019 డిసెంబరులో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిపై నిశితంగా అధ్యయనం చేయడానికి అన్ని పార్టీల సభ్యులతో కూడిన జేసీపీ ఏర్పాటయింది. 2020 బడ్జెట్ సమావేశాలు ముగిసేనాటికి నివేదిక సమర్పించాల్సి ఉన్నా, అయిదుసార్లు కాలపరిమితి పొడిగించారు. జేసీపీ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహించిన మీనాక్షి లేఖికి కేంద్రమంత్రిగా పదోన్నతి రావడంతో ఆమె స్థానంలో పి.పి.చౌధరి బాధ్యతలు చేపట్టారు.
ఇవీ చూడండి: ఆన్లైన్లో అందుకు ఆసక్తి చూపారో... ఇక అంతే సంగతి!