మధ్యప్రదేశ్‌లో ఓ సబ్ ఇంజినీర్ వింత కారణాలతో ప్రతి ఆదివారం(Sunday Leave Application) 'డే ఆఫ్' కావాలని తన పైఅధికారులను అభ్యర్థించారు. ఆ దరఖాస్తులో(Sunday Leave Application) ఆయన పేర్కొన్న అంశాలను చూడగా విస్తుపోవడం వారి వంతైంది. అసలేం జరిగిందంటే..?
గత జన్మ గుర్తొచ్చి...
అగర్ మాల్వా జిల్లాలోని(Agar Malwa News) సంశేర్ జనపద్ పంచాయతీ చీఫ్‌కు.. సబ్ ఇంజినీర్ రాజ్‌కుమార్ యాదవ్ ఈ లేఖ రాశారు. అందులో తనకు కొద్దిరోజుల క్రితమే గత జన్మ గురించి తెలిసిందని చెప్పారు. తన జీవిత రహస్యాన్ని కనుగొనడానికి, ఆత్మను శోధించేందుకు ఉపయోగపడేలా ప్రతి ఆదివారం తనకు 'డే ఆఫ్' ఇవ్వాలని కోరారు.
"నా గత జన్మలో ప్రస్తుత ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. పాండవుల్లో ఒకరైన నకులుడు. ఆయన నాకు చాలా మంచి మిత్రుడు. అదే సమయంలో ప్రస్తుతం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ శకుని. నా గత జన్మ గురించి తెలిశాక.. ఇకపై నేను నా జీవిత రహస్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. శాశ్వతమైన ఆత్మ కోసం శోధించాలనుకుంటున్నాను. "
-రాజ్‌కుమార్ యాదవ్, సబ్ ఇంజినీర్
"నేను భగవద్గీత బోధించిన మార్గాన్ని అనుసరించాలనుకుంటున్నాను. నాలో ఉన్న అహాన్ని తొలగించుకోవడానికి ప్రతి ఆదివారం భిక్షాటన చేయాలనుకుంటున్నాను. ప్రతి ఇంటి నుంచి గోధుమలను యాచించాలనుకుంటున్నాను. దానికోసమే నాకు ఆదివారం డే ఆఫ్ కావాలి" అని రాజ్‌కుమార్ యాదవ్ తన దరఖాస్తులో పేర్కొన్నారు.