Owaisi security amit shah: ప్రభుత్వం అందించే జడ్ కేటగిరీ భద్రతను స్వీకరించాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీని కోరారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒవైసీ కారుపై దాడికి సంబంధించి రాజ్యసభలో ప్రకటన చేశారు. హాపుర్ జిల్లాకు ఒవైసీ వస్తున్నట్లు అధికారులకు సమాచారమేమీ లేదని తెలిపారు. జిల్లాలో ఒవైసీకి ముందస్తు కార్యక్రమాలేవీ లేవని చెప్పారు. ఘటన తర్వాత ఒవైసీ సురక్షితంగా దిల్లీకి చేరుకున్నారని వివరించారు.
Owaisi security uttar pradesh:
"ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఆయన(ఒవైసీ) సురక్షితంగా బయటపడ్డారు. ఆయన వాహనం కింది భాగంలో మూడు బుల్లెట్ గుర్తులు ఉన్నాయి. ఘటనను ముగ్గురు వ్యక్తులు ప్రత్యక్షంగా చూశారు. వెంటనే చర్యలు తీసుకొని ఇద్దరిని అరెస్టు చేశాం. లైసెన్స్ లేని రెండు పిస్తోళ్లు, ఒక ఆల్టో కారును స్వాధీనం చేసుకున్నాం. ఒవైసీ అక్కడ పర్యటిస్తున్నారని జిల్లా కంట్రోల్ రూమ్‌కు ముందుగా ఎలాంటి సమాచారం అందలేదు."
-అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
Amit Shah in Rajya Sabha
ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని షా తెలిపారు. కారును ఫోరెన్సిక్ బృందాలు క్షుణ్నంగా పరిశీలిస్తున్నాయని చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి ఆధారాలు సేకరిస్తున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ వర్గాల అంచనా ప్రకారం ఒవైసీకి ఇంకా భద్రతాపరమైన ముప్పు ఉందని తెలిపారు.