కరోనా సమయంలో గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు 7 వరకు 9,800 మందికిపైగా చిన్నారులు అనాథలయ్యారు. 508 మంది చిన్నారులు నిరాదరణకు గురయ్యారు. 1.32లక్షల మంది తమ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయారు. ఈ మేరకు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్(ఎన్సీపీసీఆర్).. సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా కారణంగా తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరినీ కోల్పోయిన చిన్నారులకు సంబంధించి దాఖలైన కేసును జస్టిస్ ఎల్. నాగేశ్వర్రావు నేతృత్వంలోని ధర్మాసనం సుమోటాగా సోమవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఎన్సీపీసీఆర్ దాఖలు చేసిన అఫిడవిట్లో కీలక సమాచారాన్ని వెల్లడించింది.
బాలస్వరాజ్ పోర్టల్-కొవిడ్ కేర్లో పొందుపరిచిన సమాచారం ప్రకారం.. గతేడాది ఏప్రిల్ నుంచి డిసెంబరు 7 వరకు 9,855 మంది చిన్నారులు అనాథలుగా మారారాని ఎన్సీపీసీఆర్ తెలిపింది. 1,32,113 మంది చిన్నారులు తమ తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరిని కోల్పోయారని చెప్పింది. 508 మంది నిరాదరణకు గురయ్యారని వెల్లడించింది.