భారత్‌లో టీకా పంపిణీ విస్తృతంగా సాగుతోంది. ఈ క్రమంలో సోమవారం మరో మైలురాయిని అందుకుంది భారత్. ఇప్పటివరకు 75 కోట్లు డోసుల (covid vaccine) పంపిణీ పుర్తయింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.
'ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే అతిపెద్ద టీకా పంపిణీ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు నిండిన ఏడాదిలో.. 75 కోట్ల టీకాల పంపిణీ జరగడం విశేషం.'
-మన్సుఖ్ మాండవీయ, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి
75 కోట్లు డోసులు పంపిణీ పూర్తవడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ భారత్‌ను అభినందించింది. కేవలం 13 రోజుల్లోనే పంపిణీ సంఖ్య 65 కోట్ల నుంచి 75 కోట్లకు చేరిందని కొనియాడింది.
సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్, గోవా, దాద్రా-నగర్ హవేలీ, లద్దాఖ్, లక్షద్వీప్‌లలో పెద్దలు అందరూ టీకా తీసుకున్నారు. వీరిలో కొందరు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకోగా.. మరికొందరు ఒక డోసు తీసుకున్నారు.
దేశంలో వ్యాక్సిన్ పంపిణీ సంఖ్య 10 కోట్లు (covid vaccine) చేరడానికి 85 రోజులు పట్టింది. ఆ తర్వాత క్రమంగా టీకా పంపిణీ పుంజుకుంది. అక్కడి నుంచి వ్యాక్సినేషన్ సంఖ్య.. 45 రోజుల్లో 20 కోట్లకు, 20 రోజుల్లో 50 కోట్లకు, 19 రోజుల్లో 60 కోట్లకు చేరింది.
విడతల వారీగా చేపట్టిన వ్యాక్సినేషన్.. జనవరి 16న ప్రారంభమైంది.
రాష్ట్రాల్లో కరోనా కేసులు..
- కేరళలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 15,058 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధరణ అయింది. 28,439 మంది కోలుకోగా.. 99 మంది ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 16.39 శాతంగా ఉంది.
- మహారాష్ట్రలో కొత్తగా 2740 మందికి మహమ్మారి సోకింది. ఫిబ్రవరి 9 తర్వాత రాష్ట్రంలో ఇంత తక్కువ కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. 3233 మంది వైరస్‌ను జయించగా.. 27 మంది మృతిచెందారు.
- కర్ణాటకలో కొత్తగా 673 కొవిడ్ కేసులు బయటపడ్డాయి. మహమ్మారి నుంచి 1074 మంది కోలుకోగా.. వైరస్ ధాటికి 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
- దిల్లీలో కొత్త 17 మందికి కరోనా సోకగా.. ఎలాంటి మరణాలు నమోదు కాలేదు.
ఇదీ చూడండి :'కొవాగ్జిన్‌కు ఈ వారంలోనే డబ్ల్యూహెచ్ఓ గుర్తింపు!'