దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. ఇప్పటికీ కొందరు వాక్సిన్ వేయించుకునేందుకు వెనుకంజ వేస్తున్నారు. ప్రజల్లో కోవిడ్ వాక్సిన్ పట్ల ఉన్న అపోహలను తొలగించే ఉద్దేశ్యంతో.. వాక్సిన్ల సమర్థతపై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ -ఐసీఎెంఆర్ వివరాలను వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా తయారైన.. కోవాగ్జిన్ తో పాటు.. కోవిషీల్డ్ టీకాలను వినియోగిస్తున్నారు. ఇప్పటివరకూ కోటీ పదిలక్షల మందికి కొవాగ్జిన్ టీకాలు అందించామని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ తెలిపారు. మొదటి డోసు తీసుకున్న 93 లక్షల మందిలో 4వేల 208 మందికి కరోనా సోకినట్లు వివరించారు. కొవాగ్జిన్ టీకా రెండు డోసులు తీసుకున్న 17 లక్షల 37 వేల 178 మందిలో 695 మందికి కరోనా సోకినట్లు వెల్లడించారు. కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 21వేల మందికి కరోనా సోకినట్లు కేంద్రం వెల్లడించింది. రెండో డోసు తీసుకున్న తర్వాత సుమారు ఐదున్నర వేల మంది కొవిడ్ బారినపడినట్లు వెల్లడించింది. మొత్తం సంఖ్యలో ఇది 0.04 శాతమని.. కొవాగ్జిన్ టీకా తీసుకున్న పదివేల మందిలో నలుగురికి కొవిడ్ సోకినట్లు వివరించారు.
"కొవిషీల్డ్‌కు సంబంధించి దేశవ్యాప్తంగా 11కోట్ల 60 లక్షల మందికి కొవిషీల్డ్ టీకా వేశాం. వీరిలో పదికోట్ల మందికి మొదటిడోసు ఇచ్చాం. కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న వారిలో 17వేల 145 మందికి కరోనా సోకింది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న కోటీ 57 లక్షల 32 వేల 754 మందిలో 5 వేల 14 మంది వైరస్ బారిన పడ్డారు. మొత్తం సంఖ్యలో ఇది 0.03 శాతం. కొవిషీల్డ్ టీకా తీసుకున్న 10వేల మందిలో ఇద్దరికి మాత్రమే కరోనా సోకింది."