తాలిబన్ల ఆక్రమణతో ఆందోళనకరంగా మారిన అఫ్గాన్ పరిస్థితులను.. భారత అత్యున్నతస్థాయి రక్షణాధికారులు సమీక్షిస్తున్నట్టు తెలుస్తోంది. అఫ్గాన్‌లో చిక్కుకున్న భారత రాయబార కార్యాలయం సిబ్బంది, భద్రతా సిబ్బందితో పాటు దాదాపు 200మంది భారతీయులను త్వరితగతిన వెనక్కి తీసుకురావడమే ప్రస్తుతమున్న లక్ష్యంగా వారు భావిస్తున్నట్టు సమాచారం.
మరోవైపు కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నెలకొన్న గందరగోళం ఆందోళనలు కలిగిస్తోంది. దేశాన్ని వీడేందుకు ప్రజలు భారీస్థాయిలో విమానాశ్రయానికి తరలివెళుతున్నారు. పరిస్థితులు క్షణక్షణానికి దారుణంగా మారుతున్న నేపథ్యంలో కాబుల్‌లోని భారత రాయబార కార్యాలయం నుంచి సిబ్బందిని విమానాశ్రయానికి తీసుకురావడం కూడా కష్టంగా మారింది. ఈ పరిస్థితుల వల్లే.. భారత్ నుంచి విమానాలు పంపించడంలో జాప్యం ఏర్పడుతోందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఏ క్షణంలోనైనే ఎగిరేందుకు సీ-17 గ్లోబ్‌మాస్టర్ వంటి భారీస్థాయి ఎయిర్‌క్రాఫ్ట్‌లు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం.
విమానాశ్రయంలో గందరగోళం కారణంగా కాబుల్‌కు వెళ్లాల్సి వాణిజ్య విమానం కూడా రద్దు అయినట్టు సంబంధిత వర్గాలు స్పష్టం చేశాయి.
ఈ క్రమంలో భారత విదేశాంగశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది.
"పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాము. అఫ్గాన్‌లో భారతీయుల భద్రతకు అన్నివిధాలుగా కృషిచేస్తాము. అఫ్గాన్‌లోని సిక్కులు, హిందు సంఘాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నాము. అత్యవసర పరిస్థితుల్లో మాట్లాడేందుకు వీలుగా కొన్ని ఫోన్ నెంబర్లు పంపించాము. అఫ్గాన్‌ను వీడి దేశానికి వచ్చేయాలి అని అనుకుంటున్న వారిని తరలించే ప్రయత్నంలో ఉన్నాము. భద్రతకు సంబంధించి సమయానుగుణంగా ఆదేశాలు జారీచేస్తాము."
-- భారత విదేశాంగశాఖ.
'చర్యలు చేపట్టాలి...'