Rahul Gandhi Parliament Speech Today : మణిపుర్‌లో భరతమాతను హత్య చేశారని బీజేపీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాందీ. మణిపుర్ ప్రజలను హత్య చేయడం ద్వారా దేశాన్ని చంపేశారని విమర్శించారు. భారత సైన్యం తలుచుకుంచే ఒక్క రోజులోనే మణిపుర్‌లో శాంతి సాధ్యమవుతుందని అన్నారు. 'మీరు దేశభక్తులు కాదు.. దేశ ద్రోహులు. మీరు దేశాన్ని రక్షించే వారు కాదు.. దేశ హంతకులు. మణిపుర్‌లో మీరు తల్లులను హత్య చేశారు. మోదీ మణిపుర్ మాట వినేందుకు ఇష్టపడట్లేదు. రావణుడు కేవలం మేఘనాథ్, కుంభకర్ణుడి మాటలే వినేవాడు. మోదీ కూడా అమిత్ షా, అదానీ మాటలే వింటున్నారు.' అని రాహుల్ గాంధీ విమర్శించారు. లోక్‌సభలో బుధవారం అవిశ్వాస తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్ ప్రసంగించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా ధ్వజమెత్తారు.
'భయపడొద్దు.. ఈ రోజు అదానీ గురించి మాట్లాడను'
Rahul Gandhi On Manipur : బీజేపీకి రాజనీతి లేదని.. హిందుస్థాన్‌ను హత్య చేసిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. తన ప్రసంగం గురించి బీజేపీ భయపడాల్సిన అవసరం లేదని.. తాను అదానీ అంశంపై ఈ రోజు మాట్లాడనని వ్యంగ్యంగా అన్నారు. 'కొన్నిరోజుల క్రితం నేను మణిపుర్ వెళ్లాను. ప్రధాని మోదీ ఇప్పటి వరకు మణిపుర్ వెళ్లలేదు. ప్రధాని దృష్టిలో మణిపుర్ దేశంలో భాగం కాదు. ఆ రాష్ట్రంలోని పునరావాస శిబిరాల్లోని మహిళలు, పిల్లలతో నేను మాట్లాడాను. బాధితులకు మద్దతుగా నేను రాత్రంతా వారితో గడిపాను. మోదీ మణిపుర్‌ను రెండు వర్గాలుగా విడగొట్టారు' అని రాహుల్ విమర్శించారు.
'సత్యం కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం'
Rahul Gandhi Speech In Lok Sabha Today : తాను నమ్మిన సత్యం కోసం జైలుకు వెళ్లేందుకైనా సిద్ధమేనని రాహుల్ గాంధీ అన్నారు. భారత్ జోడో యాత్ర సమయంలో ప్రజాసమస్యలు తనను కదిలించాయని తెలిపారు. బీజేపీ ప్రతిచోట కిరోసిన్‌ను జల్లుతోందని విమర్శించారు. మణిపుర్‌లో కిరోసిన్ పోసి నిప్పంటించారని.. ప్రస్తుతం హరియాణాలో అదే పని చేస్తున్నారని మండిపడ్డారు. అంతకుముందు.. తన లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్ధరించినందుకు స్పీకర్ ఓం బిర్లాకు రాహుల్ ధన్యవాదాలు తెలిపారు.