Opposition Meeting In Bengaluru : సార్వత్రిక సమరానికి సమయాత్తమవుతున్న విపక్ష నేతలు.. బెంగళూరు వేదికగా రెండు రోజులపాటు విస్త్రతస్థాయిలో చర్చలు జరిపారు. ఈ భేటీలో.. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సహా దిల్లీ, పంజాబ్, బిహార్, ఝార్ఖండ్, బంగాల్, తమిళనాడు సీఎంలు పాల్గొన్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్, ఆర్జేడీ నేత లాలూప్రసాద్ యాదవ్ హాజరయ్యారు. సోమవారం సమావేశంలో ఉమ్మడి ప్రణాళిక రూపకల్పన, సంయుక్త ఆందోళనల నిర్వహణ లక్ష్యంగా సమాలోచనలు జరిపిన నేతలు.. మంగళవారం కూటమి పేరు ఖరారు చేశారు. ఇండియన్ నేషనల్ డెవెలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్‌గా.. కూటమికి నామకరణం చేశారు. ఈ సందర్భంగా పలు తీర్మానాలను ఆమోదించారు. తక్షణమే కులాల ఆధారంగా జనగణన చేపట్టాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేశారు.
విద్వేషాలను రెచ్చగొడుతూ, మైనార్టీలపై దాడులకు పాల్పడేవారిని, మహిళలు, దళితులు, గిరిజనులు, కశ్మీరీ పండిట్లపై హింసకు పాల్పడుతున్న వారిని ఓడించడమే.. తమ లక్ష్యమని తీర్మానించారు. రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా.. దేశ మూల సిద్ధాంతాన్ని పరిరక్షించాలని సంయుక్త తీర్మానంలో ప్రముఖంగా పేర్కొన్నారు. గణతంత్ర భారతావనిపై బీజేపీ ఒక క్రమపద్ధతిలో దాడులు చేస్తోందని ఆందోళన వ్యక్తం చేసిన విపక్షాలు.. దేశ చరిత్ర కీలక మలుపు ముంగిట ఉందని పేర్కొన్నాయి. అధికార పార్టీని వ్యతిరేకించే వారిపై బీజేపీ విషప్రచారం చేస్తూ.. దారుణంగా దాడులకు పాల్పడుతోందని తీర్మానంలో విపక్ష నేతలు ధ్వజమెత్తారు. అందుకే రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా ప్రత్యామ్నాయ అజెండాను.. ప్రజల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నట్లు వివరించారు. సమావేశం అనంతరం నేతలంతా కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు.
Opposition Unity Meeting in Bengaluru : విపక్షాల కూటమికి INDIA (ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయెన్స్)గా పేరు పెట్టామని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. విపక్షాల తర్వాత సమావేశం ముంబయిలో నిర్వహిస్తామని.. తేదీని త్వరలో వెల్లడిస్తామని ఖర్గే చెప్పారు. 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేస్తామని.. కమిటీ సభ్యుల పేర్లను ముంబయిలో ప్రకటిస్తామని తెలిపారు.
Opposition Alliance Name India : ఎన్డీఏ సమావేశానికి 30 పార్టీలు వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని.. ఈసీ గుర్తించిన పార్టీలు వచ్చాయా? లేదా? అనేది తెలియదని ఎన్డీఏకు పరోక్షంగా చురకలంటించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తోందని అన్నారు ఖర్గే. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలతో విపక్ష నాయకులపై దాడులు చేస్తోందని మండిపడ్డారు. దేశ ప్రయోజనాల పరిరక్షణకు అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రతిపక్షాలను ఖర్గే కోరారు.
"దేశ ప్రజల ప్రయోజనాల కోసం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించడానికి బెంగళూరు సమావేశం చాలా ముఖ్యమైనది. ఎన్నికల ప్రచార నిర్వహణ కోసం దిల్లీలో ఉమ్మడి సెక్రటేరియట్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. అంశాల వారీగా నిర్దిష్ట కమిటీలను ఏర్పాటు చేస్తాం. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి విజయం సాధిస్తాం. విపక్షాల భేటీకి 26 పార్టీల నాయకులు వచ్చారు. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ చాలా ముఖ్యం. విపక్ష కూటమికి ఐ.ఎన్.డి.ఐ.ఏగా నామకరణం చేశాం. విపక్ష కూటమి పేరును అన్ని పార్టీల నేతలు అంగీకరించారు. 26 పార్టీలతో ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేస్తున్నాం. పట్నా భేటీలో 16 పార్టీలు సమావేశమైతే.. బెంగళూరు ప్రతిపక్షాల భేటీకి 26 పార్టీలు హాజరయ్యాయి. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఉమ్మడిగా పోరాడతాం. పోరాటంలో విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వ పాలనపై అందరూ విసిగిపోయారు. "