Opposition Meeting Bengaluru : ఎన్సీపీలో తిరుగుబాటు జాతీయ స్థాయిలో ప్రతిపక్ష కూటమిపై ప్రభావం పడింది. బెంగళూరులో జులై 13, 14 తేదీల్లో తలపెట్టిన ప్రతిపక్షాల రెండో విడత సమావేశం 17,18 తేదీలకు వాయిదా పడింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కేసీ వేణుగోపాల్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ఫాసిస్ట్, అప్రజాస్వామ్యిక శక్తులను ఓడించడానికి అంతులేని విశ్వాసంతో ఉన్నామని ట్వీట్ చేశారు. అంతకుముందు మాట్లాడిన జేడీయూ అధికార ప్రతినిధి కేసీ త్యాగి.. పార్లమెంటు వర్షాకాల సమావేశాల కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలిపారు.
"ప్రతిపక్షాలు సమావేశం వాయిదా పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. బిహార్ శాసనసభ వర్షాకాల సమావేశాలు జులై 10 నుంచి 14 వరకు జరగనున్నాయి. కర్ణాటక బడ్జెట్, వర్షాకాల సమావేశాలు కూడా జులై 3 నుంచి 14 మధ్య జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా నిర్ణయించిన ప్రకారం సమావేశం కావడానికి వీలు కావడం లేదు."
--కేసీ త్యాగి, జేడీయూ అధికార ప్రతినిధి
Opposition Meeting Postponed : అంతకుముందు బిహార్‌కు చెందిన విపక్ష కూటమి పార్టీలు రాష్ట్రీయ జనతా దళ్, జేడీయూ.. బెంగళూరు సమావేశాన్ని వాయిదా వేయాలని కోరాయి. ఈ నేపథ్యంలోనే సమావేశం వాయిదాకు ఎన్సీపీలో తిరుగుబాటును కారణంగా చెప్పడంలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు, బిహార్, కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు ఉన్నందున బెంగళూరులో జరగాల్సిన సమావేశం వాయిదాకు కారణమని కేసీ త్యాగి చెప్పారు. బిహార్ అసెంబ్లీ సమావేశాలకు.. తాను, ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ అందుబాటులో ఉండాలి కాబట్టి విపక్షాల రెండో భేటీని వాయిదా వేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు సీఎం నితీశ్ కుమార్ విజ్ఞప్తి చేసినట్లు త్యాగి తెలిపారు. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ నాయకులు సైతం ఈ సమావేశాన్ని వాయిదా వేయాలని అధిష్ఠానాన్ని కోరారు. రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో నిర్వహణకు ఇబ్బందులు వస్తాయని.. అందుకోసమే వాయిదా వేయాలని విన్నవించారు.
Opposition Meeting In Bangalore : మరోవైపు ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు విపక్షాల కూటమికి.. దెబ్బగానే రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. జూన్ 23న బిహార్ రాజధాని పట్నాలో సమావేశమై.. ఐక్యత చాటిన విపక్షాలు తదుపరి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవాలని భావించాయి. ఎన్సీపీలో అజిత్ పవార్ తిరుగుబాటు చేయడం వల్ల.. ఆ ప్రభావం విపక్షాల సమావేశంపై పడింది. తొలుత జూన్ 29న శిమ్లాలో.. విపక్షాల మలివిడత సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వేదికను బెంగళూరుకు మార్చారు. జులై 13,14 తేదీల్లో బెంగళూరులో విపక్షాల రెండో సమావేశం ఉంటుందని స్వయంగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రకటించారు. ఈలోపే వేగంగా పరిణామాలు మారిపోయాయి. జాతీయస్థాయిలో విపక్ష పార్టీలను ఏకం చేసేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్న మరాఠా నేత శరద్ పవార్ సొంత పార్టీలోనేఅగ్గి రాజుకుంది.
ఆప్‌తో విపక్షాల ఐక్యత ప్రశ్నార్థకం
విపక్షాల ఐక్యతను ఎన్సీపీలో తిరుగుబాటుతో పాటు ఆమ్‌ఆద్మీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు కూడా ప్రభావితంచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్లీలో అధికారాలపై కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమతో విపక్షాలన్నీ కలిసి రావాలని.. ఆమ్ ఆద్మీ పార్టీ పట్టుబడుతోంది. అయితే.. ఆమ్ ఆద్మీకి మద్దతిచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా లేదు. రాజస్థాన్‌లో సీఎం అశోక్ గహ్లోత్, మరో నేత సచిన్ పైలెట్‌పై కేజ్రివాల్ విమర్శలు చేసి.. ఇప్పుడు కాంగ్రెస్ మద్దతు కోసం డిమాండ్ చేస్తున్నారని హస్తం పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ విమర్శలు గుప్పించారు. దిల్లీ, పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్‌తో.. కాంగ్రెస్‌కు ఉన్న విభేదాలు విపక్ష కూటమిలో ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కూటమిలోకి బీఆర్ఎస్కు నో ఛాన్స్!
మరో ఆసక్తికర విషయం ఏమంటే.. ఆదివారం తెలంగాణలో పర్యటించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. అధికార బీఆర్ఎస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్.. బీజేపీకి బీ పార్టీ అంటూ విమర్శలు గుప్పించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. బీఆర్ఎస్ను విపక్షాల కూటమిలో భాగం చేసే అవకాశాలు కనిపించడం లేదు. అదే కాకుండా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి కూడా బెంగళూరు విపక్షాల సమావేశానికి హాజరు కాబోమంటూ తేల్చిచెప్పారు. తమకు ఎలాంటి ఆహ్వానం అందలేదని చెప్పిన కుమారస్వామి.. రాష్ట్రంలో ప్రవేశపెట్టిన YST ట్యాక్స్‌పై విమర్శలు చేశారు. ఫలితంగా విపక్షాల కూటమి ఏర్పాటుపై నీలినీడలు అలుముకున్నాయని విశ్లేషిస్తున్నారు.
ఇవీ చదవండి :విపక్ష కూటమిలోకి 17 పార్టీలు.. ఎవరి బలమెంత? ఇదీ అసలు లెక్క!
'జాతి ప్రయోజనాల కోసమే విపక్షాల ఐక్యత.. 17 పార్టీలు కలిసి పోటీ.. త్వరలో మరో భేటీ'