Yogi Adityanath: భాజపాను లక్ష్యంగా చేసుకొని లఖింపుర్ ఖేరి ఘటన (రైతులపైకి వాహనం నడపటం)ను జలియన్వాలబాగ్ దురాగతంతో పోల్చుతూ విపక్షాలు చేస్తున్న ప్రచారంపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ఈ సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. దీని నుంచి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న విపక్షాల ప్రయత్నం మాత్రం ఫలించదని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా హెలికాప్టర్లో వెళుతూ ఆదివారం ఓ వార్తా సంస్థతో యోగి మాట్లాడారు.
గాలి కొత్తదే.. ఎస్పీ మాత్రం అదే..
"రాష్ట్రంలో ఇతర పార్టీలన్నీ కేవలం ద్వితీయ స్థానం కోసమే పోటీ పడుతున్నాయి. తనేను పోటీలో ఉన్న గోరఖ్పుర్ పట్టణ నియోజకవర్గ ఫలితం గురించి ఎటువంటి ఆందోళన లేదు." అని యోగి అన్నారు. 'నయూ (కొత్త) ఎస్పీ'గా తాము రూపాంతరం చెందామని సమాజ్వాదదీ పార్టీ చేసుకొంటున్న ప్రచారం గురించి అడగ్గా.. ఆదిత్యనాథ్ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. "ఈ ఎన్నికల్లోనూ నేరగాళ్లకు, మాఫఇయాకు, ఉగ్రవాదుల సహాయకులకు ఆ పార్టీ టికెట్లు ఇచ్చింది. కించిత్తు కూడా మారలేదని స్పష్టంగా తెలియడం లేదూ!" అన్నారు. 'నయూ హవా హై, పర్ వహీ ఎస్పీ హై' (గాలి కొత్తదే.. ఎస్పీ మాత్రం అదే) అని యోగి వర్ణించారు.
ప్రధాని పదవిపై ఆశలున్నాయా?
నేరగాళ్లు తమకు ఓటు వేయవద్దని అఖిలేశ్ బహిరంగ సభల్లో చెప్పారు కదా? అని అడిగినప్పుడు.. "పాత పాలన మళ్లీ వచ్చేందుకు నేరగాళ్లంతా ఒక్కటై ఓట్లు వేయాలని ఇచ్చిన పిలుపది. వ్యతిరేకార్థంలో తీసుకోవాలి"అని ఎద్దేవా చేశారు. దేశంలో 'హిందుత్వ' ప్రతినిధిగా ప్రచారంలో ఉన్న మీకు ప్రధాని పదవిపై ఆశలున్నాయా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. "పార్టీ ఇచ్చిన పని చేసుకుపోతున్నా. పదవుల కోసం నేనెప్పుడూ తాపత్రయపడలేదు" అని యోగి బదులిచ్చారు.