తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కేంద్రంపై ఐక్యంగా ఉద్యమిద్దాం' - రాహుల్ గాంధీ లేటెస్ట్ స్పీచ్

కేంద్రం ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఐక్యంగా ముందుకుసాగుదామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు విపక్షాలతో విందు భేటీ నిర్వహించారు. దీనిని 2024 లోక్‌సభ ఎన్నికలకు 'ట్రైలర్' మాత్రమేనని కాంగ్రెస్ అభివర్ణించింది.

rahul gandhi
రాహుల్ గాంధీ

By

Published : Aug 4, 2021, 5:09 AM IST

కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ఐక్యంగా ఉద్యమిద్దామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ విపక్షాలకు పిలుపునిచ్చారు. ఎంత ఎక్కువగా గళాలు కలిస్తే అంతగా ఫలితం వస్తుందని, అప్పుడు ప్రతిపక్షాల గొంతు నొక్కేయడం భాజపా-ఆరెస్సెస్‌లకు సాధ్యం కాదని పేర్కొన్నారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాన్ని పదునెక్కించడానికి 17 విపక్షాల నేతలు, ఎంపీలను మంగళవారం ఉదయం అల్పాహార విందుకు రాహుల్‌ ఆహ్వానించారు.

దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్‌ క్లబ్‌ వేదికగా జరిగిన ఈ సమావేశంలో దాదాపు 100 మంది కాంగ్రెస్‌ ఎంపీలతో పాటు ఎన్సీపీ, శివసేన, డీఎంకే, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, సమాజ్‌వాదీ, జేఎంఎం తదితర పార్టీలవారు పాల్గొన్నారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతలు గత సమావేశానికి రాకపోయినా ఈసారి వచ్చారు. బీఎస్పీ, ఆప్‌ హాజరుకాలేదు.

"మనమంతా ఐక్యంగా ఉండాలి. దాని కోసమే మిమ్మల్ని ఆహ్వానించాను. ఐకమత్యమే మహా బలం అనేది గుర్తుపెట్టుకుందాం. ఆ సూత్రమే పునాదిగా ముందుకు వెళ్దాం. విపక్ష సభ్యులు దేశంలో 60% మంది ఓటర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రభుత్వం మాత్రం అలా చూడడం లేదన్నారు."

-రాహుల్‌ గాంధీ

ఏమైనా విభేదాలుంటే పక్కనపెట్టి విపక్షం బలోపేతం కావాల్సిన అవసరం ఉందని వివిధ పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు. పెట్రో ఉత్పత్తులకు నిరసనగా.. రాహుల్‌ సహా కొందరు నేతలు సైకిళ్లపై, మరికొంతమంది కాలినడకన పార్లమెంటుకు వెళ్లారు.

ట్రైలర్ మాత్రమే..

విపక్ష నేతలతో రాహుల్‌ నిర్వహించిన సమావేశం చరిత్రాత్మకమైనదని, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇది 'ట్రైలర్‌' అని కాంగ్రెస్‌ పేర్కొంది. వచ్చే ఎన్నికల్లో విపక్షానికి రాహుల్‌ నాయకత్వం వహిస్తారా అనే ప్రశ్నకు పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్‌ సింఘ్వి సమాధానమిస్తూ.. 'నాయకత్వ విషయం ఈ సమావేశంలో చర్చకు రాలేదని' చెప్పారు. విపక్షాల ఐకమత్యాన్ని చెదరగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు జరిగినా భయపడేది లేదన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details