తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జన్యు బిల్లు.. వ్యక్తి స్వేచ్ఛకు చిల్లు!

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీఎన్​ఏ బిల్లు మానవ హక్కులను హరించే అవకాశం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ డీఎన్​ఏ బిల్లు అంటే ఏమిటి? దీని అమలుతో సామాన్యుడికి కలిగే ఇబ్బందులు మొదలైన అంశాలపై నిపుణుల సమగ్ర విశ్లేషణ.

dna bill, opinion, human rights
జన్యు బిల్లు.. వ్యక్తి స్వేచ్ఛకు చిల్లు!

By

Published : Feb 18, 2021, 6:30 AM IST

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ వంటి సామాజిక మాధ్యమాలతో పౌరుల గోప్యతకు ముప్పు వాటిల్లుతుందన్న ఆందోళనల మధ్య ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న డీఎన్‌ఏ బిల్లు ఆ భయాలను మరింత ఎగదోస్తోంది. 2019-డీఎన్‌ఏ సాంకేతికత (వినియోగం, అన్వయాల) నియంత్రణ బిల్లు పేరిట దీన్ని తీసుకువచ్చారు. 2018 జనవరిలో ఇదే బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినా, రాజ్యసభ సమ్మతి పొందలేకపోయింది. ఆ తరవాత లోక్‌సభ రద్దయి ఎన్నికలు జరిగాయి. దాంతో ఆ బిల్లుకు కాలం చెల్లింది.

ఎన్నికల తరవాత లోక్‌సభ స్పీకర్‌ ఆమోదంతో రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు లోటుపాట్ల పరిశీలనకు ఆ బిల్లును నిరుడు పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపారు. శాస్త్ర, సాంకేతిక, అటవీ, పర్యావరణ వ్యవహారాలు పరిశీలించే ఆ స్థాయీసంఘానికి కాంగ్రెస్‌ నేత జైరాం రమేశ్‌ అధ్యక్షత వహించారు. ఈ నెల ఒకటిన ఆ సంఘం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో డీఎన్‌ఏ బిల్లును సర్కారు దుర్వినియోగం చేసే అవకాశాలున్నాయని తేల్చింది. ముఖ్యంగా కుల, మత ప్రాతిపదికపై పౌరుల వ్యక్తిత్వ చిత్రణ (ప్రొఫైలింగ్‌) చేసి, వారి మానవ హక్కులను హరించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తం చేసింది.

గత 15 ఏళ్లుగా..

నేరారోపణలు ఎదుర్కొంటున్న లేదా కనిపించకుండా పోయిన వ్యక్తుల జన్యుపరమైన వివరాలతో ప్రాంతీయ, జాతీయ స్థాయులలో సమాచార నిధులను (డేటా బ్యాంక్‌) ఏర్పరచేందుకు డీఎన్‌ఏ బిల్లు వీలు కల్పిస్తోంది. అనుమానితులు, విచారణలో ఉన్న ఖైదీల డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌కూ అవకాశమివ్వడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఈ బిల్లు రూపకల్పన ప్రక్రియ 15ఏళ్ల నుంచి సాగుతోంది. అమెరికా, బ్రిటన్‌లతో సహా 60దేశాలు ఇదే తరహా బిల్లులు తీసుకొచ్చాయి. పొరుగు దేశం బంగ్లాదేశ్‌ నుంచి సైతం నిపుణులు భారత్‌కు వచ్చి డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌లో శిక్షణ పొంది వెళ్ళారు. ఆ తరవాతే బంగ్లా ప్రభుత్వం డీఎన్‌ఏ చట్టం తీసుకువచ్చిందని కేంద్ర బయోటెక్నాలజీ శాఖ వివరిస్తోంది.

నిపుణుల కొరత

వాస్తవానికి డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ పేరిట ఇప్పటికే డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ను ఉపయోగిస్తున్నారు. జాతీయ నేర గణాంకాల సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక ప్రకారం ఏటా లక్షమంది బాలలు కనిపించకుండా పోతున్నారని, 40వేల గుర్తుతెలియని మృతదేహాలు పోలీసుల దృష్టికి వస్తున్నాయని కేంద్ర బయోటెక్నాలజీ విభాగం వివరిస్తోంది. గుర్తు తెలియని వ్యక్తుల ఆచూకీ కనిపెట్టడానికి ఫోరెన్సిక్‌ నిపుణులు డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ ప్రక్రియను ఉపయోగిస్తున్నారు. కేంద్ర హోం శాఖ ఫోరెన్సిక్‌ నేర దర్యాప్తునకు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ను ఉపయోగిస్తుంటే, మరణించిన సైనికుల వివరాల నిర్ధారణకు రక్షణ శాఖ ఈ పద్ధతిని వినియోగిస్తోంది. ఇక సీబీఐ, ఎన్‌ఐఏ, పోలీసు శాఖలు రివాజుగా డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింటింగ్‌ ఉపయోగిస్తున్నాయి.

ప్రస్తుతం దేశమంతటా 15-16 ఫోరెన్సిక్‌ లేబరేటరీలలోని నిపుణులు ఏటా 3,000 కేసులు శోధిస్తున్నారు. ఇది దేశీయ అవసరాల్లో కేవలం రెండు లేదా మూడు శాతానికి సమానం. డీఎన్‌ఏ బిల్లుతో మరింత విస్తృతంగా డీఎన్‌ఏ పరీక్షలు చేయవచ్చని బయోటెక్నాలజీ శాఖ పార్లమెంటరీ స్థాయీసంఘానికి వివరించింది. కొన్నిసార్లు డీఎన్‌ఏ నమూనాలు తప్పు ఫలితాలు చూపవచ్చు లేదా నిపుణులే వాటికి తప్పుగా భాష్యం చెప్పవచ్చు. ‘రాజీవ్‌ సింగ్‌ వెర్సస్‌ స్టేట్‌ ఆఫ్‌ బిహార్‌’ కేసులో సమర్పించిన అవకతవక డీఎన్‌ఏ విశ్లేషణను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలంటే పెద్దయెత్తున నిపుణులు అవసరమవుతారు. ఉద్దేశపూర్వక, అనాలోచిత పొరపాట్ల నుంచి వ్యక్తులను కాపాడటానికి చట్టపరంగా తగిన కట్టుదిట్టమైన ఏర్పాట్లు ఉండాలి.

స్థాయీసంఘం నివేదిక ఏమంటోంది?

నేర విచారణ, శిక్షా ప్రక్రియకు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ వంటి అత్యధునాతన సాంకేతికతలను ఉపయోగించడం సమర్థనీయమే కానీ పౌరుల గోప్యతా హక్కును, ఇతర రాజ్యాంగ హక్కులను, వెరసి మానవ హక్కులను ఉల్లంఘించని రీతిలో ఈ విజ్ఞానాన్ని ఉపయోగించాలని స్థాయీసంఘం నివేదిక ఉద్ఘాటించింది. ప్రాంతీయ, జాతీయ డేటా బ్యాంక్‌లలో భద్రపరచిన వ్యక్తుల డీఎన్‌ఏ ప్రొఫైళ్లను రాజకీయ, కుల మతపరమైన అవసరాలకు ఉపయోగించబోరన్న హామీని బిల్లు కల్పిస్తుందా అని ప్రశ్నించింది.

ఉదాహరణకు నేరం జరిగిన స్థలంలో ఉద్దేశపూర్వకంగా గిట్టనివాళ్ల రక్తం, జుట్టు, ఇతర జన్యుపదార్థాలను వదిలి వారిని ఇరికించే ప్రమాదాన్ని ఎలా నివారిస్తారని అది నిలదీసింది. ఒక్కొక్కప్పుడు నేరం జరిగిన స్థలంలో నేరంతో ఎలాంటి సంబంధం లేనివారు సంచరించి ఉండవచ్చు, ఫలితంగా అక్కడ వారి డీఎన్‌ఏ ఆనవాళ్లు కనిపించవచ్చు. అయినా వారి వివరాలూ డీఎన్‌ఏ డేటా బ్యాంకుల్లోకి చేరిపోతాయి. ఈ డేటా బ్యాంకులు చివరకు పౌరులపై విస్తృత జన్యుపరమైన నిఘాకు దారితీయవచ్చని స్థాయీసంఘం ఆందోళన వ్యక్తం చేసింది.

మానవ హక్కులకు భంగం!

ఇప్పటికే చైనాలో ముఖ గుర్తింపు సాంకేతికతలను, డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ను ప్రయోగించి వీగర్‌ ముస్లింలు, అసమ్మతీయులను అణచివేస్తున్నారని మానవ హక్కుల సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. పకడ్బందీ నియంత్రణలు లేకపోతే ఈ విజ్ఞానం భారత ప్రజాస్వామ్యానికీ ముప్పు తెస్తుందని ఆలోచనాపరులు ఆందోళన చెందుతున్నారు. భారత్‌లో క్రిమినల్‌ నేరారోపణలు ఎదుర్కొంటున్న చాలామందికి తమ హక్కుల గురించి తెలియదన్న విషయం ఇక్కడ గమనించాలి. అలాంటివారు డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ వంటి ఆధునిక సాంకేతికతల నుంచి తమను తాము ఎలా కాపాడుకోగలరు? అంతేకాదు- కొత్త విజ్ఞానం గురించి పోలీసులు, న్యాయవాదులు, మేజిస్ట్రేట్లకు సైతం సంపూర్ణ అవగాహన ఉండకపోవచ్చు. ఫోరెన్సిక్‌ నిపుణుల కొరత ఉండనే ఉంది. ఈ లోపాలను సరిదిద్దకపోతే డీఎన్‌ఏ బిల్లు ఎన్నో అనర్థాలు కొనితెస్తుంది.

నేర విచారణ అవసరాలను తీర్చడానికి ప్రస్తుతం ఉన్న 15-16 ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లు ఏ మాత్రం సరిపోవు. వీటి సంఖ్యను పెద్దయెత్తున పెంచాలి. సిబ్బంది, మౌలిక వసతుల కొరతను తీర్చడం సహా డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌లోనూ పారదర్శకత తీసుకురావాలి. సుప్రీంకోర్టు పౌరులకు గోప్యత హక్కు ఉందని తీర్పు ఇచ్చిన దరిమిలా మొదట 2019-డేటా సంరక్షణ బిల్లు ఆమోదించి, ఆ తరవాతనే డీఎన్‌ఏ బిల్లు తీసుకురావాలి. కట్టుదిట్టమైన నిఘా లేనిదే మాఫియా ముఠాలు, ఉగ్రవాదులు, విదేశీ గూఢచారులు, సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించలేమన్నది ముమ్మాటికీ సత్యం. కానీ, ఈ క్రమంలో సాధారణ పౌరుల గోప్యతను, మానవ హక్కులను హరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ అనేది రాజ్యాంగ నిబంధనల స్ఫూర్తికి భంగం కలగని రీతిలో జరగాలి.

ఈ ప్రశ్నకు బదులేదీ?

డీఎన్‌ఏ ప్రొఫైలింగ్‌ వల్ల వ్యక్తి వంశ మూలాలు, నడత, ఆరోగ్య స్థితిగతులు, వ్యాధులు వచ్చే అవకాశాలు వంటి సున్నితమైన సమాచారం డేటా బ్యాంకులో నిక్షిప్తమవుతుంది. దీన్ని ఉపయోగించి వ్యక్తులకు బీమా సౌకర్యం నిరాకరించవచ్చు లేదా ఉద్యోగాలకు పనికిరావంటూ ఎసరు పెట్టవచ్చు. ఇది వారి మానవ హక్కులను ఉల్లంఘించడమే!

- వరప్రసాద్‌

ఇదీ చదవండి :'ఉత్తరాఖండ్​ వరదలకు అది కారణం కాదు'

ABOUT THE AUTHOR

...view details