ప్రభుత్వ రంగ సంస్థ ఓఎన్జీసీకి (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్) చెందిన ఓ హెలికాప్టర్ అరేబియా సముద్రంలో కుప్పకూలింది. గాల్లో ఉండగా సాంకేతిక సమస్య తలెత్తి హెలికాప్టర్‌ను అత్యవసరంగా రిగ్‌పై ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నలుగురు మృతి చెందారు. వీరిలో ముగ్గురు ఓఎన్జీసీ ఉద్యోగులు. ప్రమాదం సమయంలో చాపర్‌లో ఇద్దరు పైలట్లు సహా మొత్తం 9 మంది ఉన్నారు.
ముంబయి తీరం నుంచి 50 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. సముద్ర తీరం నుంచి సముద్ర మధ్యలోని రిగ్‌పై ల్యాండ్ కావాల్సిన హెలికాప్టర్.. దానికి 1.5కిలోమీటర్ల దూరంలో ఫ్లోటర్ల ద్వారా అత్యవసరంగా ల్యాండ్ కావాల్సి వచ్చింది. ఈ సమయంలో ప్రమాదవశాత్తు కూలిపోయింది. వెంటనే అధికారులు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. పలువురిని సురక్షింతంగా కాపాడారు. నలుగురు మాత్రం చనిపోయారు.