One Nation One Election Committee First Meeting : జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'కమిటీ'.. తొలిసారి అధికారికంగా సమావేశమైంది. దిల్లీలోని రామ్‌నాథ్ ఇంట్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన ఈ భేటీకి కమిటీ సభ్యులు హాజరయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్‌మేఘవాల్, మిగిలిన సభ్యుల్లో కొందరు.. ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జమిలి ఎన్నికల కమిటీ ఛైర్మన్‌గా ఉన్న రామ్‌నాథ్ కోవింద్‌తో న్యాయశాఖ మంత్రిత్వ ఉన్నతాధికారులు ఈ ఆదివారం భేటీ అయ్యారు. ఎనిమిది మందితో కమిటీని కేంద్రం ఏర్పాటుచేసిన నేపథ్యంలో ఏ అజెండాతో ముందుకెళ్లాలనే దానిపై న్యాయశాఖ కార్యదర్శి నితిన్‌చంద్ర, శాసన వ్యవహారాల కార్యదర్శి రీటా వశిష్ఠ తదితరులు చర్చించినట్లు సమాచారం.
'ఒకే దేశం- ఒకే ఎన్నికలు' నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు .. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో గత శుక్రవారం.. ఎనిమిది మంది నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. ఈ కమిటీలో అధికార, ప్రతిపక్ష నేతలతో పాటు.. శాసన, న్యాయ, ఆర్థిక నిపుణులకు చోటు కల్పించింది. రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ ఎంపీ అధీర్ రంజన్ చౌదరి, రాజ్యసభ మాజీ ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం మాజీ ఛైర్మన్ ఎన్కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ డాక్టర్ సుభాశ్ సీ కశ్యప్, సీనియర్ అడ్వొకేట్ హరీశ్ సాల్వే, మాజీ చీఫ్ విజిలెన్స్ కమిషనర్ సంజయ్ కొఠారి ఉన్నారు.
Parliament Special Session : అయితే సెప్టెంబరు 18 నుంచి 22 వరకు అయిదు రోజులపాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ఇటీవలే కేంద్రం అనూహ్య ప్రకటన చేసింది. కానీ ఈ సమావేశాలకు అజెండా ఏంటనేది మాత్రం వెల్లడించలేదు. దీంతో అనేక ఊహాగానాలు వెల్లువెత్తాయి. ప్రధానంగా ఈ ప్రత్యేక సమావేశాల్లో 'ఒకే దేశం.. ఒకే ఎన్నికలు' పేరుతో జమిలి ఎన్నికల బిల్లు తీసుకురాబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది.