First Women Ambulance driver: అంబులెన్స్ డ్రైవర్ అంటే కఠినమైన పరిస్థితుల్లో అత్యంత వేగంతో, ఏకాగ్రతతో వాహనాన్ని నడపాల్సి ఉంటుంది. దీనికి సాధారణంగా పురుషులే డ్రైవర్‌గా పనిచేస్తారు. కానీ ఈ పనికి నేను సైతం అని సిద్ధమయ్యారు కేరళలోని కొట్టాయం జిల్లా మెమురీ గ్రామానికి చెందిన దీపా మోల్ అనే మహిళ.
దీపా మోల్‌కు ఆది నుంచి ఆపదలో ఉన్న వాళ్లకు సహాయం చేయాలని ఆసక్తి. ఈ ఆసక్తే ఆమెను అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేసే దిశగా నడిపించింది. ప్రయాణాలు కూడా ఇష్టం కావడం వల్ల 2008లో డ్రైవింగ్ లైసెన్స్ కూడా పొందారు. అయితే ఆమె భర్త ఆనారోగ్యానికి గురవడం వల్ల కుటుంబ పోషణ కోసం ఆమె డ్రైవింగ్ వృత్తిలోకి దిగక తప్పలేదు. మొదట ట్యాక్సీ డ్రైవర్‌గా, లారీ డ్రైవర్‌గా అలాగే డ్రైవింగ్ శిక్షకురాలిగా కూడా దీప పని చేశారు. అయితే ఇతరులకు సేవ చేయాలన్న ఆసక్తి గల దీప.. అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేయాలని భావించారు. తన ఆసక్తిని తెలుపుతూ కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్‌కు విజ్ఞప్తి చేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన మంత్రి ఆమె విజ్ఞప్తికి అంగీకరించారు. మహిళా దినోత్సవం రోజే ఆమె ఈ బాధ్యతలు స్వీకరించారు. తద్వారా ప్రభుత్వ అంబులెన్సును నడుపుతున్న తొలి మహిళగా ఘనత సాధించారు.