Presidential election 2022: ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా నామినేషన్ పత్రాలు ఆమోదం పొందాయని రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ తెలిపారు. మొత్తం 115 పత్రాలు దాఖలయ్యాయి. అందులో 28 నామినేషన్లను వివిధ సాంకేతిక కారణాల వల్ల ప్రాథమిక దశలోనే తిరస్కరించారు. 72 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 87 నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి గురువారం పరిశీలించారు. అందులో నిబంధనల ప్రకారం దాఖలు చేయని 79 నామినేషన్ పత్రాలను తిరస్కరించారు.
రాష్ట్రపతి ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రతి నామినేషన్‌ను 50 మంది ఓటర్లు ప్రతిపాదించడం, మరో 50 మంది బలపరచడం తప్పనిసరి. ఇంతమంది మద్దతు కూడగట్టడం సామాన్య అభ్యర్థులకు సాధ్యం కాదు కాబట్టి చివరికి ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాత్రమే బరిలో మిగిలే అవకాశం ఉంది.