Omicron cases India: దేశంలో కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతోంది. అనేక రాష్ట్రాల్లో కొత్త కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఫలితంగా దేశంలో మొత్తం కేసుల సంఖ్య 300 దాటింది.
కర్ణాటకలో ఒకేరోజు 12 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 9,11 సంవత్సరాల బాలికలు ఉన్నారు. గురువారం మొత్తం బెంగళూరు నుంచి 10 మందికి పాజిటివ్‌గా తేలగా.. మైసూర్, మంగళూరు నుంచి ఒకరు చొప్పున ఉన్నారు.
బెంగళూరు కేసుల్లో.. ఐదుగురు యూకే నుంచి ఇటీవలే వచ్చారని, మరో ఇద్దరు డెన్మార్క్, నైజీరియాల నుంచి వచ్చినట్లు అధికారులు నిర్ధరించారు.
మైసూరులో తొమ్మిదేళ్ల బాలికకు ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది. బాలికకు ఎలాంటి లక్షణాలు లేవని మైసూరు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. అయితే, ఆమెను వేరుగా ఉంచి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. బాధితురాలి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు.
బెంగళూరులో ఒకే కుటుంబంలోని నలుగురికి ఒమిక్రాన్ సోకింది. తొలుత యూకే నుంచి వచ్చిన మహిళకు పాజిటివ్‌గా తేలగా.. అనంతరం అదే కుటుంబంలోని మరో ముగ్గురికి వైరస్ సోకింది. వారిని మణిపాల్ ఆస్పత్రికి తరలించి.. బాధితులు నివాసం ఉంటున్న అపార్ట్‌మెంట్‌ను సీల్ చేసినట్లు అధికారులు తెలిపారు. అపార్ట్మెంట్ వాసులందరికీ కరోనా టెస్టులు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
Tamil Nadu omicron cases
తమిళనాడులో ఒక్కరోజే 33 కేసులు నమోదయ్యాయి. నైజీరియా నుంచి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు తేలిందని తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. ఆయనతో పాటు ప్రయాణించిన పలువురితో పాటు మొత్తం 89 మందికి ఒమిక్రాన్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. పరీక్షించిన నమూనాల్లో 33 నమూనాలకు.. ఫలితం ఒమిక్రాన్ పాజిటివ్‌గా వచ్చాయని తెలిపారు. 13 మందికి నెగెటివ్ అని తేలిందని వివరించారు. దీంతో రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కు పెరిగిందన్నారు. చెన్నైలో 26, సేలంలో ఒకటి, మధురైలో నాలుగు, తిరువన్నమలైలో రెండు కొత్త కేసులు నమోదయ్యాయని చెప్పారు.
Omicron cases in Kerala
కేరళలో మరో ఐదుగురు ఒమిక్రాన్ వేరియంట్ బారినపడ్డారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 29కి చేరింది. ఎర్నాకుళంలోనే నలుగురిని గుర్తించినట్లు ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ పేర్కొన్నారు. వీరిలో ఇద్దరు యూకే నుంచి.. మరో ఇద్దరు ఆల్బేనియా, నైజీరియాల నుంచి రాష్ట్రానికి వచ్చినట్లు ఆమె తెలిపారు.