దేశంలోని కేన్సర్ రోగుల్లో (cancer cases in india) 52.4% మంది పురుషులే ఉన్నట్లు నేషనల్ కేన్సర్ రిజిస్ట్రీ ప్రోగ్రాం-2021 కింద భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్‌ఫర్మేటిక్స్ అండ్ రీసెర్చ్ (ఎన్‌సీడీఐఆర్)ల (ICMR Report) విశ్లేషణ పేర్కొంది. పొగాకు కేన్సర్ రోగుల్లో 50.4% మంది ఈశాన్య రాష్ట్రాల వారేనని, ఇందులో దక్షిణాది వాటా 28.6% మాత్రమేనని వెల్లడైంది. ఇందుకు సంబంధించిన నివేదిక (NCDIR report on cancer) ఆదివారం విడుదలైంది. 96 ఆసుపత్రుల నుంచి సేకరించిన కేన్సర్ రిజిష్టర్‌ల ప్రకారం 2012-19 మధ్యకాలంలో దేశవ్యాప్తంగా 13,32,207 మంది ఈ వ్యాధి బారిన పడినట్లు అందులో పేర్కొన్నారు. వాటిలో 6,10,084 కేసులను విశ్లేషించి చూడగా 3,19,098 (52.4%) మంది పురుషులు, 2,90,986 (47.6%) మంది మహిళలు ఉన్నట్లు వెల్లడైంది.
- బాల్యదశలో(0-14 ఏళ్లు) ఈ వ్యాధి సోకిన వాళ్లు 7.9% మంది ఉన్నారు.
- పొగాకు కారణంగా పురుషుల్లో 48.7%, మహిళల్లో 16.5% మంది దీనిÅ బారినపడ్డారు.
- పురుషుల్లో తల, గొంతు కేన్సర్లు మూడోవంతు (31.2%) ఉన్నాయి.
- మహిళల్లో 51% వాటా జననేంద్రియ సంబంధ, రొమ్ము కేన్సర్లదే.
- థైరాయిడ్ కేన్సర్లు మహిళల్లో 2.5% ఉండగా, పురుషుల్లో అది 1%కే పరిమితమైంది. పిత్తాశయ కేన్సర్లు మహిళల్లో 3.7%, పురుషుల్లో 2.2% మాత్రమే కనిపించాయి.
- కేన్సర్లు అత్యధికంగా 45-64 ఏళ్ల వారిలోనే నమోదయ్యాయి. ప్రొస్టేట్ కేన్సర్ ఒక్కటే 65 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువ కనిపించింది.
- ఊపిరి తిత్తుల కేన్సర్లు పురుషుల్లో 49.2%, మహిళల్లో 55.5% కనిపించాయి. పిత్తాశయ కేన్సర్ పురుషుల్లో 40.9%, మహిళల్లో 45.7% కనిపించింది.
- ఎక్కువ మందికి కీమోథెరపీ చికిత్సే అందిస్తున్నారు. రోగం బయటపడిన 8 నుంచి 30 రోజుల్లో అత్యధిక మందికి చికిత్స ప్రారంభిస్తున్నారు.
- ఈ నివేదికలో పరిగణనలోకి తీసుకున్న ఆసుపత్రుల్లో హైదరాబాద్‌లోని ఇండో అమెరికన్ కేన్సర్ ఇన్‌స్టిట్యూట్ అండ్ రీసెర్చ్ సెంటర్ ఉంది. ఇక్కడ 2012, 2017, 2018లలో నమోదైన 27,313 రోగుల్లో 11,683 (42.8%) మంది పురుషులు, 15,630 మంది (57.2%)మహిళలు.
- హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ కేన్సర్ సెంటర్‌లో 2017లో 6,444 మంది కేన్సర్ కేసులు నమోదవగా, అందులో 3,032 మంది (47.1%) పురుషులు, 3,412 (52.9%) మంది మహిళలు ఉన్నారు.
- నిమ్స్‌లో 2017లో 3,218 మంది కేన్సర్ రోగులు నమోదు చేసుకోగా, అందులో 1,816 మంది (56.4%) పురుషులు, 1,402 మంది (43.6%) మహిళలు ఉన్నారు.
- ఈఎస్‌ఐసీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో 2017-19 మధ్య 514 మంది కేన్సర్ రోగులు రాగా అందులో 200 మంది (38.9%) పురుషులు, 314 మంది (61.1%) మహిళలు ఉన్నారు.