అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నేడు దేశవ్యాప్తంగా అన్ని చోట్లా ఉదయం 11 గంటలకు తప్పనిసరిగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించాలని కేంద్ర హోంశాఖ.. రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాసింది. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల సేవలను గుర్తు చేసుకుంటూ ఏటా ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, ఇది కొన్ని కార్యాలయాలకే పరిమితమవుతూ వస్తోందని, సాధారణ ప్రజలు రోజువారీ పనుల్లో నిమగ్నమవుతూ దీన్ని విస్మరిస్తున్నారని హోంశాఖ అభిప్రాయపడింది.
ఈ ఏడాది దేశ ప్రజలందరినీ మమేకం చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కేంద్రం సూచించింది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని అన్ని విద్యాసంస్థలు, ప్రభుత్వరంగ సంస్థలకు ఆదేశాలు జారీ చేయాలని పేర్కొంది. ఈ సందర్భంగా స్వాతంత్య్రోద్యమం, జాతీయ సమైక్యతపై చర్చలు నిర్వహించవచ్చని సూచించింది. ఎక్కడా కొవిడ్-19 నిబంధనలను విస్మరించకూడదని స్పష్టం చేసింది.
ఏం చేయాలంటే..
జనవరి 30న ఉదయం 11 గంటల నుంచి 2 నిమిషాల పాటు అన్ని రకాల పనులు, కదలికలను నిలిపేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది.