తెలంగాణ

telangana

ETV Bharat / bharat

గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై ప్రారంభమైన NWDA సమావేశం - Discussions today on Godavari Kaveri River Linkage

NWDA Meeting Today: హైదరాబాద్ జలసౌధలో జాతీయ జలాభివృద్ధి సంస్థ టాస్క్‌ఫోర్స్ సమావేశం ప్రారంభమైంది. ఎన్‌డబ్ల్యూడీఏ ఛైర్మన్ భోపాల్ సింగ్ అధ్యక్షతన.. గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై చర్చిస్తున్నారు.

National Water Development agency
National Water Development agency

By

Published : Mar 6, 2023, 7:15 AM IST

Updated : Mar 6, 2023, 12:33 PM IST

NWDA Meeting Today: హైదరాబాద్ జలసౌధలో గోదావరి-కావేరీ నదుల అనుసంధానంపై జాతీయ జల అభివృద్ధి సంస్థ భేటీ అయింది. ఎన్‌డబ్ల్యూడీఏ సంస్థ ఛైర్మన్ భోపాల్ సింగ్ అధ్యక్షతన సమావేశం జరుగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర జల వనరుల శాఖ సలహాదారు వెదిరె శ్రీరాం సహా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల ఉన్నతాధికారులు, ఇంజినీర్లు పాల్గొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి గోదావరిలో కేటాయించిన నీటి వాటాలో వినియోగించుకోకుండా ఉన్న.. 141 టీఎంసీలను కావేరీకి తరలించాలన్నది ప్రతిపాదన. ఇందుకు సంబంధించి జాతీయ జల అభివృద్ధి సంస్థ ఇప్పటికే సంప్రదింపులు జరిపింది. రాష్ట్రాలన్ని కూడా తమ అభిప్రాయాలను గతంలోనే స్పష్టం చేశాయి. తాజాగా ఇవాళ జరుగుతున్న టాస్క్​ఫోర్స్ సమావేశంలో నదుల అనుసంధానంపై మరోమారు చర్చిస్తున్నారు.

ఆ రాష్ట్రం లేకుండా చర్చించడం సబబు కాదు..: అయితే నేటి సమావేశానికి ఛత్తీస్‌గఢ్‌ను ఆహ్వానించకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. ఆ రాష్ట్ర నీటిని మళ్లించే ప్రతిపాదనపై.. ఆ రాష్ట్రం లేకుండా చర్చించడం సబబు కాదని అభిప్రాయపడింది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాన్ని కూడా సమావేశానికి ఆహ్వానించాలని కోరుతూ మూడు రోజుల క్రితం ఎన్‌డబ్ల్యూడీఏకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.

గతంలోనూ పలుమార్లు లేఖలు: తెలంగాణ ప్రభుత్వం గతంలోనూ పలుమార్లు ఎన్‌డబ్ల్యూడీఏకు పలు అంశాలపై లేఖలు రాసింది. గోదావరి-కావేరీ నదుల అనుసంధానం విషయంలో ఆ సంస్థ తీసుకుంటున్న నిర్ణయాలపై తెలంగాణ ఈఎన్​సీ తన అభిప్రాయాలు లేఖల ద్వారా ప్రస్తావించింది. 2022 నవంబర్​లోనూ నదుల అనుసంధానం గురించి రాష్ట్ర సర్కార్ లేఖ రాసింది. తొలుత మహానది-గోదావరీ నదుల అనుసంధానం పూర్తయ్యాకే.. గోదావరి-కావేరీ లింక్ చేపట్టాలని వెల్లడించింది. అదే విధంగా కొన్ని అంశాలను ప్రభుత్వం ప్రస్తావనకు తీసుకువచ్చింది.

ఉమ్మడి ఏపీలోనే ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలని ప్రతిపాదించారని.. అయితే తమ రాష్ట్రాల్లో ముంపు సమస్య వస్తుందని ఆనాడే మహారాష్ట్ర, ఛత్తీస్​గఢ్ అభ్యంతరం తెలిపాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రతిపాదిత ఇచ్చంపల్లి ఛత్తీస్​గఢ్ సరిహద్దుకు సమీపాన ఉండడంతో.. మళ్లీ అక్కడి నుంచి అభ్యంతరం రావచ్చని వివరించింది. ఇచ్చంపల్లి దిగువన తెలంగాణ రాష్ట్రానికి 158 టీఎంసీల మేర నీటి అవసరాలు ఉన్నాయని.. అదే ఆనకట్ట కడితే వాటిపై ఆ ప్రభావం పడుతుందని సర్కార్ ఆవేదన వ్యక్తం చేసింది. తెలంగాణ అవసరాలు తీరాకే నీటి మళ్లింపు జరగాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఇలా కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో మహానది-గోదావరీ నదుల అనుసంధానం పూర్తయ్యాక.. లేదా పనులు వేగవంతం అయ్యాక మాత్రమే గోదావరి-కావేరీ నదుల లింక్ అంశాన్ని ప్రతిపాదించవచ్చని పేర్కొంది. ఈ క్రమంలోనే నదుల అనుసంధాన ప్రతిపాదనలు ఖరారు చేసే సమయంలో.. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకోవాలని జాతీయ జలాభివృద్ధి సంస్థను రాష్ట్ర ప్రభుత్వం కోరింది.

ఇవీ చదవండి:ఛత్తీస్‌గఢ్‌ లేకుండా ఆ సమావేశం భావ్యం కాదు

మెడికల్ కాలేజీలపై గవర్నర్, హరీశ్​రావు మధ్య ట్వీట్ వార్

Last Updated : Mar 6, 2023, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details