భాజపా ఎంపీ రీటా బహుగుణ జోషి, కాంగ్రెస్ నేతలు రాజ్‌బబ్బర్, ప్రదీప్ జైన్ ఆదిత్యతో పాటు మరో ఆరుగురిపై నాన్‌బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూలోని ప్రత్యేక ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు. 2015నాటి ఓ కేసు విచారణకు వీరంతా న్యాయస్థానం ఎదుట హాజరుకానుందుకు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. నిందితులపై ఇప్పటివరకు వారెంట్లు ఎందుకు జారీ చేయలేదని హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్‌హెచ్‌వోకు)కు సమన్లు పంపింది.
2015నాటి కేసు...
2015, ఆగస్టు 17న లక్ష్మణ్ మేళా వద్ధ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. అయితే అకస్మాతుగా ధర్నాలో కూర్చున్న నాయకులు, 5వేల మంది కార్యకర్తలు విధాన భవన్ వద్దకు వెళ్లి గుమిగూడారు. వీరిని అక్కడ గుమిగూడకుండా ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పరిస్థితి అదుపుతప్పింది. పోలీసులపైకి నిరసనకారులు రాళ్లురువ్వారు. ఫలితంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడీఎం, ఎస్పీ, సీవో, ఎస్‌హెచ్‌వో స్థాయి అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. అశోక మార్గ్ నుంచి వెళ్లే సాధారణ పౌరులకు కూడా గాయాలయ్యాయి.
అనంతరం ఈ ఘటనపై హజ్రత్‌గంజ్ పోలీస్ స్టేషన్లో అధికారులు కేసు నమోదు చేశారు. 19మందిని నిందితులుగా పేర్కొన్నారు. ఆ కేసులో నిందితురాలుగా ఉన్న ప్రస్తుత భాజపా ఎంపీ రీటా బహుగుణ అప్పట్లో కాంగ్రెస్‌లో ఉన్నారు.
ఇదీ చూడండి: దిల్లీని వీడనున్న సోనియా గాంధీ!