స్వల్పకాలానికి జవాన్లను నియమించేందుకు వీలుగా కేంద్రం ప్రవేశపెట్టిన 'అగ్నిపథ్' పథకంపై నిరసనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో కేంద్రం స్పందించింది. అగ్నిపథ్ పథకం సైన్యంలోని నియామక ప్రక్రియపై ఎలాంటి ప్రభావం చూపదని.. తొలి ఏడాది ఈ పథకం ద్వారా ఎంపికయ్యే వారి సంఖ్య మొత్తం సైన్యంలో మూడు శాతం మాత్రమే అని పేర్కొంది. యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రవేశపెట్టినట్లు స్పష్టం చేసింది.
ఈ పథకం ద్వారా.. 17.5 నుంచి 21 ఏళ్లు మధ్య ఉన్న వారు త్రివిధ దళాలలో చేరవచ్చు. నాలుగేళ్ల పాటు సేవలు అందించాక వీరిలో 25 శాతం మందికి మాత్రమే సైన్యంలో కొనసాగే అవకాశం ఉంటుంది. ఈ పథకం కింద సైన్యంలో చేరిన వారిని 'అగ్నివీరులు'గా పిలుస్తారు. ఈ ఏడాది మొత్తం 46,000 మంది సైనికులను నియమించనుంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ మంగళవారం ప్రకటించింది.
అయితే దీనిపై దేశంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. బిహార్‌లో వరుసగా రెండోరోజూ వీధుల్లోకి వచ్చి యువకులు ఆందోళన చేశారు. రోడ్డు, రైలు మార్గాలను దిగ్బంధించారు. పట్నా-గయా, పట్నా-బక్సర్ రహదారులను నిరసనకారులు నిర్బంధించారు. జెహానాబాద్‌లో 83వ నంబర్ జాతీయ రహదారిని అడ్డగించారు. రోడ్డుపై టైర్లు తగులబెట్టారు. రాష్ట్రంలోని జెహానాబాద్, ఛాప్ర, నవాదా జిల్లాల్లో నిరసనకారులు ర్యాలీలు నిర్వహించారు. టీఓడీ(టూర్ ఆన్ డ్యూటీ- అగ్నిపథ్)ను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.