కరోనా రెండో దశ ముప్పు ఇంకా వీడలేదని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించకపోతే మరోసారి ప్రమాదం తప్పదని హెచ్చరించింది. పర్యటక ప్రాంతాల్లో ప్రజలు నిబంధనలను పాటించకుండా సంచరించడం ఆందోళన చెందాల్సిన అంశమని పేర్కొంది. వేర్వేరు దేశాలను కలవరపెడుతున్న లామ్డా వేరియంట్‌ను ఇప్పటివరకు భారత్‌లో గుర్తించలేదని చెప్పింది.
"లామ్డా వేరియంట్ అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ వేరియంట్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇప్పటివరకైతే భారత్‌లో ఈ వేరియంట్ వెలుగు చూసిందనడానికి ఆధారాలు లేవు. "
-వీకే పాల్, నీతి ఆయోగ్ సభ్యుడు
ఆ రెండు రాష్ట్రాల్లోనే..
దేశంలో గతవారం నమోదైన మొత్తం కేసుల్లో సగం కంటే ఎక్కువ మహారాష్ట్ర(21శాతం), కేరళ(32శాతం)లోనే నమోదయ్యాయని వీకే పాల్ తెలిపారు. జులై 8న 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 66 జిల్లాల్లో కొవిడ్ పాజిటివిటీ రేటు 10 శాతం కంటే ఎక్కువగా నమోదైందని చెప్పారు.