Liquor prohibition law: మద్యపాన నిషేధ చట్టాన్ని అత్యంత పేలవంగా అమలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తున్నతున్న తరుణంలో ఆ చట్టానికి సవరణలు చేయాలని భావిస్తోంది బిహార్ ప్రభుత్వం. నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన శిక్షలు విధంచకుండా కొంత ఉపశమనం కల్పించాలనే ఆలోచనలో ఉంది. అయితే తొలిసారి చట్టాన్ని ఉల్లంఘించిన వారికే వీటిని వర్తింపజేసేలా చర్యలు చేపట్టనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం నితీశ్ కుమార్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది.
డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడితే ఫైన్‌తో సరి..
ప్రతిపాదనల ప్రకారం.. డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారు పెనాల్టీ చెల్లిస్తే వారిని వెంటనే విడిచిపెడతారు. అయితే తరచూ ఇలా పట్టుబడేవారికి మాత్రం ఇది వర్తించదు. అలాంటి వారికి జైలు శిక్ష విధిస్తారు. అంతేగాక ఇంట్లోనే మద్యం సేవిస్తే ఎలాంటి అభ్యంతరం ఉండదు. ఇప్పటికే బిహార్‌లోని మందుబాబులు మద్యం హోం డెలివరీ సౌకర్యాన్ని చాలా బాగా ఉపయోగించుకుంటున్నారు. కొత్త ప్రతిపాదనలు దీన్ని ప్రోత్సహించే విధంగా ఉండనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
మద్యం అక్రమ రవాణా చేసే వాహనాలు పట్టుబడినా ఫైన్ చెల్లించిన అనంతరం వాటిని వదిలిపెట్టవచ్చని ప్రతిపాదనల్లో ఉన్నట్లు అధికార జేడీయూ వర్గాలు తెలిపాయి. గత నాలుగు నెలల్లో బిహార్‌లోని పలు జిల్లాల్లో కల్తీ మద్యం ఘటనలు భారీగా వెలుగుచుశాయి. వీటిలో 80మందికి పైగా మరణించారు. కొంత మంది కంటిచూపు కోల్పోయారు. ఫలితంగా నితీశ్ కుమార్ తీవ్ర రాజకీయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఈ విషయంపై జేడీయూ మిత్రపక్షం హిందుస్థానీ ఆవామ్ మోర్చా(HAM) అధికార ప్రతినిధి దానిశ్ రిజ్వాన్ మాట్లాడారు. మద్యపాన నిషేధం చట్టానికి సవరణలు చేయడమో, సమీక్షించడమో కాకుండా ఓ సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రజలు సవరణలకు సుముఖంగా ఉంటే తాము దాన్ని వ్యతిరేకించమని పేర్కొన్నారు. అలాగే ప్రజలు మద్యపానాన్ని పూర్తిగా నిషేధించాలని కోరుకున్నా ఆ నిర్ణయాన్ని గౌరవిస్తామన్నారు.