Nirmala Sitharaman Forbes : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఇంకోసారి అరుదైన గౌరవం దక్కింది. ఈ ఏడాదికి గానూ ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు దక్కింది. భారత్ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు లభించగా వారిలో నిర్మలా సీతారామన్ తొలి స్థానంలో నిలిచారు. ప్రపంచవ్యాప్త జాబితాలో ఆమె 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది 36వ స్థానంతో సరిపెట్టుకున్నారు.
నిర్మలా సీతారామన్ తర్వాత భారత్ నుంచి హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా 60వ స్థానంలో, సెయిల్ ఛైర్‌పర్సన్ సోమా మోండల్ 70వ స్థానంలో నిలిచారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజూందర్ షా 76వ స్థానంలో ఉన్నారు. వీరికి కూడా వరుసగా ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కింది.
ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన మహిళల జాబితాలో యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా వాన్ దెర్ లెయెన్ తొలి స్థానాన్ని కైవసం చేసుకున్నారు. రెండో స్థానంలో యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అధిపతి క్రిస్టినా లగార్డ్, మూడో స్థానంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ఉన్నారు. వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, అమెరికా గాయని టేలర్ స్విప్ట్ చోటు సంపాదించారు.