'తొమ్మిదేళ్ల అభివృద్ధితో పదేళ్ల పండుగ' Telangana Development in Nine Years :దశాబ్దాల పోరాటం, ఎందరో అమరుల త్యాగాల ఫలితంగా ఆవిర్భవించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం.. 9 సంవత్సరాలు పూర్తై పదో వసంతంలోకి అడుగు పెడుతోంది. ఎన్నో ఆకాంక్షలు, ఆశయాల మధ్య ఏర్పడిన నూతన తెలంగాణ రాష్ట్రంలో తమ జీవితాలు బాగుపడతాయని ప్రజానీకం గంపెడు ఆశలు పెట్టుకొంది. నీళ్లు, నిధులు, నియామకాలే ట్యాగ్‌లైన్‌గా సాగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఫలితాలను స్వరాష్ట్రంలో అందుకొని గౌరవంగా, గర్వంగా నిలవాలని తెలంగాణ సమాజం కలలు కంది. అందులో భాగంగా ఉద్యమనేతకే రాష్ట్ర పాలనాపగ్గాలు అప్పగించింది.
Telangana Formation Day Celebrations : నవతెలంగాణ రాష్ట్ర పునాది, నిర్మాణ బాధ్యతలు కూడా కేసీఆర్ పైనే పెట్టింది. 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. సంక్షేమం, అభివృద్ధే ధ్వేయంగా సాగిన పాలనా ప్రస్థానంతొమ్మిదేళ్లు పూర్తి చేసుకొని 10 సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వ్యవసాయం, సాగునీరు, పారిశ్రామక రంగాలకు పెద్దపీట వేయడంతో పాటు తెలంగాణ గుండెకాయ లాంటి భాగ్యనగర ప్రతిష్ఠవప పెంచి విశ్వనగరంగా తీర్చిదిద్దుతానని జూన్2 2014న సీఎం కేసీఆర్ ప్రకటించారు.
నీటిపారుదల రంగంపై దృష్టి : 70 శాతానికి పైగా ప్రజలు ఆధారపడిన వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తామని చెప్తూ.. వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్.. గత తొమ్మిదేళ్లుగా ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. సాగునీటి కష్టాలు తీర్చడమే లక్ష్యంగా నీటిపారుదుల రంగంపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మిషన్ కాకతీయ ద్వారా గొలుసు కట్టు చెరువులను పునరుద్ధరించారు. 43 వేల పైచిలుకు చెరువులకు పూర్వ వైభవం రావడంతో పాటు భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేపట్టడంతో పాటు పెండింగ్ ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి సారించారు.
Telangana Decade Celebrations 2023 :ఏటా బడ్జెట్‌లో సాగునీటి రంగానికి అత్యధిక నిధులు ఇస్తూ.. ప్రాజెక్టుల పనులు పరుగులు పెట్టించారు. అందుకు నిదర్శనమే ప్రపంచంలోనే అతి పెద్దదైన బహుళ దశ ఎత్తిపోతల పథకం కాళేశ్వరం ప్రాజెక్టు. ఇది రికార్డు స్థాయిలో పూర్తి కావడం మరో విశేషం. పెద్దపెద్ద జలాశయాలను నిర్మించి నీటినిల్వ సామర్థ్యాన్ని భారీగా పెంచారు. వీటితో పాటు ఇతర ప్రాజెక్టుల పనులనూ వేగవంతం చేశారు. భక్త రామదాసు ప్రాజెక్టు, ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకం లాంటి వాటిని పూర్తి చేయడంతో పాటు సీతారామ, పాలమూరు-రంగారెడ్డి, డిండి, తదితర ప్రాజెక్టుల పనులు వివిధ దశల్లో ఉన్నాయి. ఎత్తైన ప్రాంతాలకు నీరు అందేలా ఎక్కడికక్కడ ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. చిన్న నదులు, వాగులు, వంకలపై చెక్ డ్యాంల నిర్మాణం చేపట్టారు.
కోటి పాతిక ఎకరాల మాగాణం లక్ష్యాన్ని నిర్దేశించుకున్న కేసీఆర్ సర్కార్.. ఇప్పటి వరకు 74 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందించినట్లు చెబుతోంది. సాగునీటి విస్తీర్ణం కూడా 119 శాతం పెరిగినట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సాగునీటి రంగంపై రూ.లక్షా 55 వేల కోట్ల ఖర్చు చేశారు. రైతులకు ఉచితంగా నాణ్యమైన విద్యుత్ అందేలా చర్యలు తీసుకున్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలను ఇచ్చాయి. నాడు నెర్రెలు వాడిన తెలంగాణ నేడు పచ్చని పంటపొలాలతో కళకళలాడుతోంది.
Telangana Development Works: 2014లో లక్షా 43 వేల ఎకరాలుగా ఉన్న సాగువిస్తీర్ణం 2023 నాటికి ఏకంగా 97% పెరిగి 2 లక్షల మార్కు అధిగమించింది. వరి ఉత్పత్తిలో తెలంగాణ రికార్డు సృష్టించింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో కేవలం 49 వేల ఎకరాల్లోనే వరిసాగు ఉండగా.. నేడు దాదాపు లక్ష ఎకరాల వరకు చేరి భారతదేశానికి అన్నపూర్ణగా మారింది. వరి ఉత్పత్తిలో పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాలను అధిగమించి దేశానికే అన్నం పెట్టే అన్నపూర్ణగా మారిందంటే తెలంగాణ ప్రగతి ప్రస్థానం ఏ దిశగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇతర పంటల విస్తీర్ణం కూడా గణనీయంగా పెరిగింది. రైతుబంధు, రైతుబీమా లాంటి పథకాలు విప్లవాత్మకంగా మారి ఇతర రాష్ట్రాలు, జాతీయ స్థాయిలోనూ అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్రం ఏర్పాటైన ఆర్నెళ్లలోనే.. నాణ్యమైన విద్యుత్ సరఫరా : గుక్కెడు మంచినీటి కోసం మైళ్ల దూరం నడవాల్సిన అవసరం లేకుండా కృష్ణా, గోదావరి నదీ జలాలను శుద్ధి చేసి.. ఇంటి వద్దే నల్లాల ద్వారా అందించే మిషన్ భగీరథ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేసింది. స్వరాష్ట్రంలో కరెంటు ఉత్పత్తిని కూడా గణనీయంగా పెంచింది తెలంగాణ సర్కార్. సమైక్య రాష్ట్రంలో ఉన్న కరెంటు కోతలను రాష్ట్రం ఏర్పాటైన ఆర్నెళ్లలోనే అధిగమించి.. నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తున్న సర్కార్.. ప్రజల విశ్వాసాన్ని పొందిందనే చెప్పుకోవచ్చు. నాడు కరెంటు వస్తే రికార్డు అనే కాలం నుంచి నేడు కరెంటు పోతే రికార్డు అనే పరిస్థితులు నెలకొన్నాయంటే విద్యుత్ రంగంలో జరిగిన అభివృద్ధిని అర్థం చేసుకోవచ్చు.
రాష్ట్రంలో వెనకబడిన వర్గాలకు పెద్దపీట : అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఏటా బడ్జెట్‌లో సింహభాగం కేటాయింపులు సంక్షేమ రంగానికే చేస్తోంది. సమాజంలో వెనకబడిన వర్గాలైన దళిత, గిరిజన, బలహీన, మైనార్టీ వర్గాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం కోసం వివిధ కార్యక్రమాలు, పథకాలను సర్కార్ అమలు చేస్తోంది. ఆసరా ఫించన్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, గొర్రెల పంపిణీ, చేపపిల్లల పంపిణీ, నేతన్నలకు చేయూత, కులవృత్తులకు తోడ్పాటు, దళితబంధు, ఆరోగ్యలక్ష్మి, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్, విదేశీ విద్యానిధి, గురుకుల పాఠశాలలు, కళాశాలలు, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్, తదితర కార్యక్రమాలు అమలు చేస్తోంది.
పెద్ద సంఖ్యలో గురుకుల విద్యాలయాలు ఏర్పాటు చేయడం ద్వారా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తోంది. వివిధ వర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తోంది. ఏటా 50 వేల కోట్ల చొప్పున సంక్షేమం కోసం ఇప్పటి వరకు దాదాపు రూ.5 లక్షల కోట్లు కేటాయించినట్లు సర్కార్ చెబుతోంది. ప్రభుత్వ మాటల్లో చెప్పాలంటే సంక్షేమానికి ఇది స్వర్ణయుగం. ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేస్తున్నారు. గిరిజన తండాలు, ఆదివాసీ గూడెలను పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో పాటు గిరిజన రిజర్వేషన్లను 10%కి పెంచారు.
తొమిదేళ్ల ప్రాయంలోనే దేశానికి దిక్సూచిగా మారిన తెలంగాణ రాష్ట్రం.. ఇటు దేశంలో.. అటు ప్రపంచంలోనూ ప్రత్యేకస్థానం కైవసం చేసుకుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్న రాజధాని హైదరాబాద్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రత్యేక స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో మిగతా రంగాల అభివృద్ధిని మరో కథనంలో తెలుసుకుందాం.
ఇవీ చదవండి: