NIA raids trichy: కేరళ తుపాకులు, డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు బుధవారం సోదాలు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న తమిళనాడులోని 20 ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. చెన్నైలోని 9, తిరుచ్చిలో 11 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు ఎన్ఐఏ అధికారులు. గతేడాది కేరళలోని వెలిచంలో 300 కిలోల హెరాయిన్, ఐదు ఏకే 47 తుపాకులు, తూటాలు దొరికాయి. ఈ కేసును గతేడాది మేలో ఎన్ఐఏకు బదిలీ చేయగా దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఆరుగురు శ్రీలంక దేశస్థులను అరెస్ట్ చేశారు. ఎల్టీఈ ఉద్యమానికి సంబంధించిన అనేక పత్రాలు, సిమ్ కార్డులను సీజ్ చేశారు.
మరోవైపు నేరచరిత్ర కలిగిన విదేశీయులపై కూడా జాతీయ దర్యాప్తు సంస్థ దాడులు చేపట్టింది. తిరుచ్చిలో నివసిస్తున్న శ్రీలంక, బల్గేరియా, దక్షిణ కొరియా, రష్యా, యూకే, బంగ్లాదేశ్, కెన్యా దేశాలకు చెందిన 100కు పైగా నేరస్థుల ఇళ్లలో సోదాలు చేసింది. ఎన్ఐఏ అధికారులతోపాటు స్థానిక పోలీసులు ఈ ఆపరేషన్లో పాల్గొన్నారు.