ముంబయిలో ఉగ్రదాడులు జరుగుతాయంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు మెయిల్ చేశాడు. తాను తాలిబన్ సభ్యుడినంటూ దానిలో పేర్కొన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీంతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు.. ఈ సమాచారాన్ని ముంబయి పోలీసులకు అందించారు. అనంతరం పోలీసులతో కలిసి సంయుక్త దర్యాప్తు ప్రారంభించింది ఎన్ఐఏ. ఫోన్ చేసిన ఐపీ అడ్రస్ పాకిస్థాన్‌లో గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ బెదిరింపుతో అప్రమత్తమైన మహారాష్ట్ర పోలీసులు రాష్ట్రంలోని అన్ని నగరాలను అప్రమత్తం చేశారు.
అంతకుముందు కూడా ముంబయిలో పేలుళ్లకు పాల్పడతామంటూ చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. నగరంలో చాలాచోట్ల బాంబులు పెట్టామంటూ గతేడాది అక్టోబర్‌లో పోలీసులకు ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. తర్వాత అది ఫేక్ కాల్ అని తేలింది. ఈ ఏడాది జనవరిలోనూ ముంబయిలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్ వచ్చింది. స్కూల్‌లో టైంబాంబు పెట్టామంటూ ఫోన్ రాగా అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో గుజరాత్‌కు చెందిన ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. అయితే, ఫేమస్ కావడం కోసమే తాను ఈ బెదిరింపులకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో నిందితుడు పేర్కొనడం గమనార్హం.