పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్లో బేధాభిప్రాయాలు తొలగినట్లు కనిపిస్తోంది. ఆ పార్టీలోని కీలక నేతలు ఒకేతాటిపైకి వచ్చినట్లు తెలుస్తోంది. నిన్నమొన్నటి వరకు ఎడమొహం పెడమొహంగా ఉన్న సీఎం అమరిందర్ సింగ్, నూతన పీసీసీ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ.. శుక్రవారం ఒకే వేదికపై కనిపించనున్నారు.
పీసీసీ సారథిగా ప్రమాణ స్వీకరణ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ.. అమరిందర్కు రెండో లేఖ రాశారు సిద్ధూ. ఈ లేఖపై 56 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు.
ఇది జరిగిన కాసేపటికే.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సహా పార్టీ సీనియర్ నేతలను అమరిందర్ తన ఇంటికి ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం అక్కడి నుంచే అందరూ కలిసి పంజాబ్ కాంగ్రెస్ భవన్కు వెళ్దామని సమాచారం ఇచ్చారు. "సీఎం అమరిందర్ సింగ్ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ సీనియర్ నేతలను తేనీటి విందుకు ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ వింధు జరిగిన తర్వాత పంజాబ్ కాంగ్రెస్ భవన్కు వెళ్తారు" అని సీఎం ప్రతినిధి ఒకరు తెలిపారు.