భారత్‌లో విస్తరిస్తున్న కరోనా రకానికి వేగంగా, ఎక్కువగా వ్యాపించే గుణం ఉందని.. వ్యాక్సిన్‌తో ఏర్పడే రోగనిరోధకతను ఇది తప్పించుకునే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రధాన శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. గత అక్టోబర్‌లో గుర్తించిన బి.1.617 రకమే భారత్‌లో ప్రస్తుత కరోనా విలయానికి కారణమని తెలిపారు.
అలాగే, భారత్‌లో కరోనా ఉద్ధృతికి వైరస్ కొత్త రకాలు ఒక్కటే కారణం కాదని స్వామినాథన్ అభిప్రాయపడ్డారు. ప్రజలు భారీ సంఖ్యలో గుమిగూడేందుకు, భారీ స్థాయి సమావేశాలకు అనుమతి ఇవ్వడం వల్ల వైరస్ పోరులో భారత్ ఒకరకంగా నిర్లక్ష్యం వహించినట్లయిందని వివరించారు. వైరస్ వ్యాప్తి ఇక ముగిసిందని పొరబడిన ప్రజలు మాస్కులు ధరించడం వంటి నిబంధనల్ని పాటించడంలో ఏమరపాటుగా వ్యవహరించారని తెలిపారు.
భారత్ వంటి భారీ జనాభా ఉన్న దేశాల్లో కరోనా వ్యాప్తి నెమ్మదిగా ఉండాల్సిందని.. తొలి రోజుల్లో అదే జరిగిందని స్వామినాథన్ తెలిపారు. కానీ, కేసులు ఒక్కసారిగా పెరగడం ప్రారంభం అయిన తర్వాత వైరస్ విలయాన్ని ఆపడం కష్టంగా మారిందని పేర్కొన్నారు. ఒక్కసారి లక్షలాది మంది వైరస్ బాధితులుగా మారితే.. వ్యాప్తి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుందని.. నియంత్రించడం కష్టంగా మారుతుందని వివరించారు.