Sheena Bora murder case: షీనా బోరా హత్య కేసులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. షీనా బోరో చనిపోలేదు బతికే ఉందని, కశ్మీర్లో నివసిస్తోందని ప్రధాన నిందితురాలు ఇంద్రాణి ముఖర్జీ ఇప్పటికే సీబీఐకి లేఖ రాశారు. ఇప్పుడు ఇంద్రాణి ముఖర్జీ తరఫు న్యాయవాది సన ఆర్ ఖాన్.. షీనా బోరాను కశ్మీర్లో కలిసిన మహిళ కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమని చెప్పారు.
జూన్ 24న ఓ మహిళ కశ్మీర్‌లోని దాల్ సరస్సు సమీపంలో షీనా బోరాను కలిశారని ఇంద్రాణీ ముఖర్జీ సీబీఐకి రాసిన లేఖలో పేర్కొన్నారని సన వెల్లడించారు. జైలులో కలిసిన ఓ మహిళ తనకు ఈ విషయం చెప్పిందని ఇంద్రాణీ తెలిపారన్నారు. ఆ మహిళే ఇప్పుడు సీబీఐ ముందు ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సన వివరించారు.
Sheena bora in kashmir
2012 ఏప్రిల్ 24న షీనా బోరా హత్య జరిగింది. ఇంద్రాణీ ముఖర్జీతో పాటు షీనా మారు తండ్రి పీటర్ ముఖర్జీ, ఇంద్రాణీ డ్రైవర్ శ్యామ్ సుందర్ రాయ్‌ను ముంబయి పోలీసులు 2015 ఆగస్టులో అరెస్టు చేశారు. షీనాను అపహరించి, హత్య చేశారని అభియోగాలు మోపారు. అప్పటి నుంచి ఇంద్రాణీ జైలులోనే ఉంటున్నారు.
తన మాజీ భర్త కొడుకుతో షీనా రిలేషన్షిప్లో ఉందనే విషయాన్ని ఇంద్రాణీ గ్రహించి ఈ హత్య చేసిందని అధికారులు ఆరోపిస్తున్నారు. తన తల్లి గురించి నిజాలు బయటపెడతానని షీనా హెచ్చరించడం కూడా హత్యకు కారణమై ఉండొచ్చని సీబీఐ వాదిస్తోంది. హత్య తర్వాత.. దాన్ని కప్పిపుచ్చేందుకు పెద్ద కథను అల్లారు ఇంద్రాణీ. షీనా తన సోదరి అని, అమెరికాకు వెళ్లిపోయిందని చెప్పుకొచ్చారు. అయితే, మరో కేసులో ఇంద్రాణీ డ్రైవర్ అరెస్టు కావడం వల్ల షీనా హత్య వెలుగులోకి వచ్చింది. డ్రైవర్ వాంగ్మూలంతో షీనా మృతదేహాన్ని ముంబయికి దగ్గర్లోని ఓ అడవిలో అధికారులు గుర్తించారు.
ఇదీ చదవండి:పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థికి ఒకే ఒక్క ఓటు.. ఇంట్లో 12 మంది ఉన్నా..