తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కొత్త పార్లమెంట్​ ఓపెనింగ్​పై సుప్రీంకోర్టులో కేసు.. విమర్శల దాడి పెంచిన కాంగ్రెస్ - పార్లమెంట్ ఓపెనింగ్​కు విపక్షాలు దూరం

New Parliament Building Inauguration : నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్​లో దాఖలైంది. లోక్​సభ సెక్రటేరియట్.. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని పిల్​లో పిటిషనర్ పేర్కొన్నారు. మరోవైపు.. పార్లమెంట్ నూతన భవనం ప్రారంభించడంపై అధికార ఎన్​డీఏ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.

new parliament building inauguration invitation
new parliament building inauguration invitation

By

Published : May 25, 2023, 2:38 PM IST

New Parliament Building Inauguration : నూతన పార్లమెంట్ భవన ప్రారంభంపై చెలరేగిన రగడ సుప్రీం కోర్టుకు చేరింది. పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో గురువారం పిటిషన్ దాఖలైంది. లోక్​సభ సెక్రటేరియట్.. నూతన భవన ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకుండా రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని న్యాయవాది జయ సుకిన్​ పిల్​ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ.. మే 28న పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఆయన కాకుండా రాష్ట్రపతితో పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించేలా చూడాలని పిల్​లో పిటిషనర్ కోరారు.

'ప్రధాన మంత్రిని రాష్ట్రపతి నియమిస్తారు. అలాగే కేంద్ర కేబినెట్​ను ప్రధాన మంత్రి సలహా మేరకు రాష్ట్రపతి నియమిస్తారు. గవర్నర్లు, సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు వంటి రాజ్యాంగపరమైన అధికారులను నియమించడానికి భారత రాష్ట్రపతికి అధికారం ఉంది. యూపీఎస్​సీ, ప్రధాన ఎన్నికల కమిషనర్​ లాంటి అధికారులను రాష్ట్రపతే నియమిస్తారు. అలాంటప్పుడు పార్లమెంట్​ను రాష్ట్రపతి ప్రారంభించాలి' అని పిల్​లో న్యాయవాది జయ సుకిన్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఫైర్​..
నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనుండడంపై కాంగ్రెస్ మాటల దాడిని తీవ్రం చేసింది. మోదీ ప్రభుత్వ అహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసిందని మండిపడింది. ఒక వ్యక్తి అహం, స్వీయ ప్రచారం​ కోరిక.. దేశ గిరిజన మహిళా రాష్ట్రపతి హక్కును హరిస్తోందని విమర్శించింది.

"మోదీ ప్రభుత్వ అహంకారం పార్లమెంటరీ వ్యవస్థను నాశనం చేసింది. పార్లమెంట్​ ప్రజలు స్థాపించిన ప్రజాస్వామ్య దేవాలయం. రాష్ట్రపతి కార్యాలయం పార్లమెంట్​లో భాగం. 140 కోట్ల మంది దేశ ప్రజలు పార్లమెంటు భవనాన్ని ప్రారంభించే హక్కును భారత రాష్ట్రపతికి ఇచ్చారు. ఆ హక్కును మీరేందుకు హరిస్తున్నారు?" అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

ఎన్​డీఏ ఎదురుదాడి..
మే 28న జరగనున్న కొత్త పార్లమెంటు భవన ప్రారంభాన్ని బహిష్కరించాలని విపక్షాలు నిర్ణయించిన వేళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్​డీఏ.. ఆ పార్టీలపై ఎదురుదాడికి దిగింది. విపక్షాల నిర్ణయం ప్రజాస్వామ్య వ్యవస్థకే ఘోర అవమానంగా అభివర్ణించింది. భారత రాజ్యాంగ విలువలను ఈ చర్య అవహేళన చేస్తుందని పేర్కొంది. బహిష్కరణపై పునరాలోచించుకోవాలని ఎన్​డీఏలోని రాజకీయ పార్టీలు.. విపక్షాలకు విజ్ఞప్తి చేశాయి. ప్రజాస్వామ్యాన్ని కించపరిస్తే చేస్తే ప్రజలు క్షమించరని.. చరిత్రలో నిలిచిపోయే ఈ చర్య.. విపక్షాల వారసత్వంపై నీలి నీడను కప్పుతుందని హెచ్చరించాయి. వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా జాతి గురించి ఆలోచించాలని స్పష్టం చేశాయి. పౌరుల జీవితాలను ప్రభావితం చేసే.. ప్రజాస్వామ్యానికి గుండె అయిన పార్లమెంటును అగౌరవపర్చొద్దని ఎన్​డీఏ సూచించింది.

ప్రతిపక్షాలకు మోదీ చురకలు..
పార్లమెంటు నూతన భవనం ప్రారంభానికి వచ్చేది లేదంటూ ప్రతిపక్షాలు తేల్చి చెప్పిన వేళ.. విపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ పరోక్షంగా విరుచుకుపడ్డారు. ఆస్ట్రేలియాలోని ప్రతిపక్ష పార్టీలతో పోలుస్తూ ఘాటు విమర్శలు చేశారు. 3 దేశాల పర్యటనను ముగించుకుని భారత్‌కు వచ్చిన ప్రధాని దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాలో విపక్ష, అధికార పక్షాలు కలిసికట్టుగా ఉన్నాయన్న ఉద్దేశంలో మోదీ మాట్లాడారు. సిడ్నీలో జరిగిన కమ్యూనిటీ ఈవెంట్‌ను ప్రస్తావించి మోదీ కార్యక్రమంలో ఆస్ట్రేలియా ప్రధాని, మాజీ ప్రధానులతో పాటు దేశం కోసం పని చేస్తున్న విపక్ష ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. కొవిడ్‌ సమయంలో వ్యాక్సిన్‌లను విదేశాలకు ఎగుమతి చేయడాన్ని విపక్షాలు వ్యతిరేకించిన విషయాన్ని మోదీ గుర్తు చేశారు. భారత్‌లో బుద్ధుడు, గాంధీ జన్మించారని.. శత్రువులను కూడా తాము దయతో చూస్తామని పేర్కొన్నారు.

'దయచేసి రండి'
పార్లమెంట్ ప్రజాస్వామ్య దేవాలయమని అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​. 'ప్రధాని కూడా పార్లమెంట్ మెట్లకు నమస్కరించి లోపలికి ప్రవేశిస్తారు. నేను ప్రతిపక్షాలకు అభ్యర్థిస్తున్నా. దయచేసి నూతన పార్లమెంట్ భవనం ప్రారంభానికి హాజరవ్వండి.' అని సీతారామన్ విజ్ఞప్తి చేశారు.

టీడీపీ హాజరు..
నూతన పార్లమెంట్​ భవనం ప్రారంభానికి టీడీపీ హాజరవుతున్నట్లు ప్రకటించింది. పార్టీ తరఫున టీడీపీ రాజ్యసభ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్​ హాజరవ్వనున్నట్లు పేర్కొంది.

భద్రత పెంపు..
నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం నేపథ్యంలో దిల్లీలో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేయనున్నారు. పార్లమెంట్ వైపు వెళ్లే రోడ్లు వద్ద బారీకేడ్లు ఏర్పాటు చేయనున్నారు. గురువారం జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details